ఏనుగు ఘటన తర్వాత మరో దారుణం: గర్భంతో ఉన్న ఆవు నోట్లో బాంబు పెట్టి..
By సుభాష్ Published on 6 Jun 2020 10:27 AM GMTకేరళలోని పాలక్కడ్ జిల్లా మలప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు పేలుడు పదార్థాలతో కూడిన కొబ్బరి కాయ తినడంతో ఏనుగు మరణించిన విషయం తెలిసిందే. ముందుగా ఫైనాపిల్ పిండు అనుకున్నా.. అది కాదు.. కొబ్బరికాయ అని అటవీ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏనుగును చంపిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ దేశ వ్యాప్తంగా డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటన మర్చిపోక ముందే అలాంటి దారుణం ఓ ఆవుకు జరిగింది. గర్భంతో ఉన్న ఓ ఆవు నోట్లో బాంబు పేలింది. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ వైరల్‌గా మారింది. బాంబు పేలుడు వల్ల ఆవు దవడలు పగిలిపోయాయి. నోటీ నుంచి తీవ్ర రక్తస్రావం అయ్యింది. కాగా, ఆవు యజమాని గురుదయాళ్ సింగ్ తనకు న్యాయం చేయాలని, ఈ దారుణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు.
తన ఇంటి పక్కనే ఉన్న నందలాల్ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు ఆయన ఆరోపించాడు. ఆవుకు ఏదో పేలుడు పదార్థం తినిపించడం వల్ల తీవ్రంగా గాయపడినట్లు చెప్పాడు. ఈ ఘటన జరిగిన తర్వాత నందలాల్ పరారైనట్లు తెలిపాడు. పది రోజుల కిందట ఆవుపై ఈ ఘటన జరిగిందని, కనీసం ఏమి కూడా తినడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది చదవండి: ఆ ఏనుగు తిన్నది ఫైనాఫిల్ కాదట..
ఇలా మూగ జీవాలపై ఇలాంటి దారుణాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి మానవమృగాళ్లు మనుషులపైనే కాకుండా జంతువులపై కూడా ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.