తెలంగాణ పోలీసులు దిశ నిందితులను మ‌ట్టుపెట్ట‌డంపై దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు సంబరాలు జ‌రుపుకుంటున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుంటూ మ‌రీ.. సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కాలేజీల్లో, స్కూళ్లో.. దిశ‌కు న్యాయం జరిగిందంటూ డ్యాన్స్ చేస్తూ త‌మ‌ ఆనందాన్ని తెలుపుతున్నారు. ఇక తెలంగాణ‌ పోలీసులను ప్రశంసిస్తూ వారిపై పూల వర్షం కురిపిస్తున్నారు.

మ‌రోవైపు.. దిశ నిందితుల‌కు స‌రైన‌ దిశానిర్దేశం చేశారంటూ.. సైబరాబాద్ సీపీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాహో సజ్జనార్‌… జ‌య‌హో సజ్జనార్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్‌ మాట్లాడుతూ… దిశ హత్యకేసు నిందితులను సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా విచారణ జరుపుతున్నప్పుడు పోలీసులపై రాళ్ల‌తో దాడి చేసి.. తప్పించుకుని పారిపోయే ప్ర‌య‌త్నం చేయ‌గా.. ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలిపారు. పోలీసుల విధి నిర‍్వహణలో భాగంగానే ఎన్‌కౌంటర్‌ జరిగిందని ఆయ‌న‌ అన్నారు.

అప్పుడు కూడా…

వరంగల్‌లో కూడా పదేళ్ల క్రితం స్వప్నిక, ప్రణీత అనే ఇద్ద‌రు యువ‌తుల‌పై శాఖమూరి శ్రీనివాస్, బజ్జురి సంజయ్, పోతరాజు అనే దుండ‌గులు యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన స్వప్నిక మృతి చెందగా, ప్రణీత చాలాకాలానికి కోలుకుంది. అయితే.. యాసిడ్‌ దాడికి పాల్పడ్డ ముగ్గురు యువకులను పోలీసులు త్వ‌రిత‌గ‌తిన‌ అరెస్ట్ చేశారు. మూడు రోజుల అనంతరం నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. అప్పుడు వరంగల్ జిల్లా ఎస్పీగా సజ్జనార్‌ ఉన్నారు. ఆ ఘటనపై అప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఇప్పుడు..

నెల 27వ తేదీన షాద్‌న‌గ‌ర్ శివారులోని తొండుపల్లి దగ్గరలోని టోల్‌ప్లాజా ప్లాన్ ప్ర‌కారం దిశను టోల్‌ప్లాజా పక్కన ఉన్న.. ఖాళీ ప్రాంతానికి బలవంతంగా లాక్కెళ్లారు. దిశ అరవకుండా ముక్కు, నోరు గట్టిగా నొక్కిపట్టారు. అనంతరం ఆమెపై అత్యాచారం జరిపి, హత్య చేశారు. దిశ ఇంటికి రాకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డది జొల్లు శివ, జొల్లు నవీన్‌, చింతకుంట్ల చెన్నకేశవులు, మహ్మద్‌ పాషా లుగా పోలీసులు గుర్తించారు. నవంబర్‌ 28 గురవారం మధ్యాహ్నం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గ‌డిచిన తొమ్మిది రోజులుగా పోలీసుల క‌స్డ‌డీలో ఉన్న‌ నలుగురు నిందితులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పోలీసుల‌పై రాళ్లు రువ్వుతూ పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో నిందితులు మహ్మద్‌ ఆరిఫ్‌, చెన్నకేశవులు, శివ, నవీన్ లు.. దిశను కాల్చిన ప‌రిస‌ర ప్రాంతంలోనే ఎన్‌కౌంటర్‌ చేశారు.

గ‌తంలో వ‌రంగ‌ల్, ఇప్పుడు దిశ‌.. ఈ రెండు ఎన్‌కౌంటర్ ఘ‌ట‌న‌ల తాలుకా క్రెడిట్ అంతా సీపీ సజ్జనార్‌దే. దీంతో సజ్జనార్‌పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.