కరోనా కాదు 'కోవిడ్-19'
By అంజి
చైనాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా గడగడ లాడిస్తున్న కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా పేరును పెట్టింది. కరోనాకు కోవిడ్-2019(covid-2019)ను పేరుగా నిర్ణయించినట్లు వెల్లడించింది. కోవిడ్ పూర్తి పేరు c- corona, v- virus, d- disease2019.
నిజానికి కరోనా అనే పేరు దానికి చెందిన కొన్ని వైరస్‌ల సమూహాన్ని సూచిస్తుంది. దీంతో ఈ పేరుపై గందరగోళాన్ని తొలగించేందుకు పరిశోధకులు ఈ అధికారిక పేరును పెట్టారు. ప్రజల్లో గందరగోళం కలిగించకుండా ఒకపేరు ఉండటం ముఖ్యమని, అందుకే కొత్త పేరు నిర్ణయించామని ప్రకటించారు. ఈ పేరు ఒక భూభాగాన్ని గానీ, ఒక జంతువును గానీ, ఒక స్వతంత్ర జాతిని గానీ సూచించదని, ఒక వ్యాధిని మాత్రమే తెలియజేస్తుందని వెల్లడించారు.
కోవిడ్-19 యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు 1016 మంది మృతి చెందారు. సోమవారం ఒక్క రోజే 108 మంది మరణించగా, మరో 2478 కేసులు నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య కమిషన్ తన నివేదికలో తెలిపింది. మొత్తంమీద 7,333 మంది పరిస్థితి తీవ్రంగా ఉంది. సుమారు 1.87 లక్షల మందిపై వైద్య పరిశీలన కొనసాగుతోంది. చైనాలో రోజుకు సుమారు వంద మంది మృత్యువాత పడుతుండడంతో ప్రపంచ దేశాల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. అటు భారత్ పాటు మరో 20 దేశాలకు కోవిడ్-19 విస్తరిస్తోంది. అయితే చైనాలో ఈ వ్యాధి బాధితులు ఎంతమంది? ఇప్పటివరకు ఎంతమంది మరణించారన్న లెక్కలపై స్పష్టత కొరవడింది. ఇటు చైనా ప్రభుత్వం గానీ, అధికార యంత్రాంగం గానీ ఈ లెక్కలపై స్పష్టతనివ్వట్లేదు.
మరోపక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున బ్రూస్ ఐల్వార్డ్ నేతృత్వంలో బీజింగ్‌కు వచ్చిన అంతర్జాతీయ నిపుణుల బృందం కార్యాచరణలో దిగింది. ఈ బృందానికి చైనా అధికారులు తోడయ్యారు. ఇరువురూ సంయుక్తంగా వ్యాధిని ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. అటు యూఏఈలోని దుబాయిలో మరో భారతీయుడు కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటివరకూ ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 8కి చేరుకుంది.