వచ్చే ఏడాది మొదట్లో కరోనా వ్యాక్సిన్.. వారికే ప్రాధాన్యత: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
By సుభాష్ Published on 14 Sept 2020 8:17 AM ISTప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. వ్యాక్సిన్ కోసం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం తలమునకలవుతున్నాయి. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోగా కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ఆదివారం సోషల్ మీడియాలో 'సండే సంవాద్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. వ్యాక్సిన్ భద్రతపై ఎవరికీ సందేహాలు, ఆందోళనలు లేకుండా తానే మొదటి డోసు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.
వ్యాక్సిన్ వచ్చాక సీనియర్ సిటిజన్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొలి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. అలాగే ఆర్థికంగా టీకా కొనుగోలు చేసే సామర్థ్యం లేకపోయినా వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇక కరోనా సోకిన వారిలో అత్యవసరం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. తొందరలోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర సర్కార్ అన్ని చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ భద్రత, నాణ్యత, ధర, ఉత్పత్తి, సరఫరా అలా అన్ని విషయాల్లో విస్తృత స్థాయిలోచర్చలు పూర్తయ్యాయన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతులు ఇచ్చాకే సీరమ్ ఇనిస్టిట్యూట్ భారత్‌లో ప్రయోగాలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు.