మరికొన్ని రోజులు బస్సులపై నిషేధం: సీఎం కేసీఆర్
By సుభాష్ Published on 27 May 2020 10:01 PM ISTకరోనా వైరస్‌కు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో లాక్‌డౌన్‌పై పలు కీలక అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... లాక్‌డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి ఉధృతంగా లేదని, అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగానే ఉండాలన్నారు.
అలాగే హైదరాబాద్‌లో మరికొన్ని రోజుల పాటు ఆర్టీసీ సిటీ సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని, రేపటి నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. జేబీఎస్, ఇమ్లీబస్టాండ్ కు కూడా ఇకపై జిల్లాల నుంచి వచ్చే బస్సులు వెళ్తాయన్నారు. అలాగే బస్టాండుల్లోకి టాక్సీలు, ఆటోలకు అనుమతి ఇచ్చారు.
కొన్ని అంచనాల ప్రకారం రాబోయే రెండు, మూడు నెలల్లో కరోనా కేసులు పెరుగుతాయని, కేసుల సంఖ్య పెరిగినప్పటికీ తగిన వైద్యం అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్దంగా ఉందన్నారు. ఇక వ్యాధి లక్షణాలు లేని కరోనా బాధితులకు చికిత్స అవసరం లేదన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. వైరస్ సోకిన తర్వాత కూడా అత్యధిక శాతం మందిలో కనీసం కరోనా లక్షణాలేవి కనిపించడం లేదన్నారు.వైరస్ సోకిన వారిలో 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవని అన్నారు. వారికి వైద్యం కూడా అవసరం లేదన్నారు. భారత్‌లో 2.86 శాతం ఉండగా, తెలంగాణలో 2.82 శాతం మరణాల రేటు ఉందని అన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాతా జనాల కదలికలు పెరిగాయన్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలు భారీగానే పెరిగాయన్నారు.