కరోనా వైరస్.. చైనా అతలాకుతలం..
By అంజి Published on 26 Jan 2020 11:24 AM GMTముఖ్యాంశాలు
- భారీ స్థాయిలో ఎస్.ఎస్.ఆర్.ఎస్ వైరస్ కేసులు
- వూహన్ ప్రాంతంలో నిండిపోయిన ఆసుపత్రులు
- ఐసోలేడెట్ వార్డుల్లో ప్రత్యేక వైద్య సేవలు
- 237 కేసులు అత్యంత ప్రమాదకరంగా గుర్తింపు
- వూహాన్ లో హాస్పిటల్స్ లో చేరిన 1500 మంది
- ప్రపంచవ్యాప్తంగా 1,321 కరోనా కేసుల నిర్ధారణ
- మరో రెండు వేలమందికి కరోనా సోకినట్టు అనుమానం
- శుక్రవారం నుంచి అంతర్గత టూరిస్ట్ కార్యకలాపాలు బంద్
- సోమవారం నుంచి బైటి టూరిస్టులకు దార్లు బంద్
చైనాని కరోనా వైరస్ వణికిస్తోంది. ముఖ్యంగా వూహూన్ ప్రాంతంలో ఈ వైరస్ విస్తృతి అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకోవడంవల్ల వందలాదిమందికి ప్రాణాపాయ స్థితులు ఏర్పడ్డాయి. అక్కడి అధికారులు ఆరోగ్య ఆత్యయిక స్థితిని విధించారు. చైనా ప్రభుత్వం ఉన్నపళంగా పూర్తి స్థాయిలో టూరిస్ట్ యాక్టివిటీస్ ని నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వూహూన్ ప్రాంతంతోపాటుగా మిగిలిని అనేక నగరాల్లో ఎస్.ఎస్.ఆర్.ఎస్ వైరస్ లక్షణాలు విపరీతంగా ప్రబలాయి. ఒక్క వూహూన్ లోనే దాదాపుగా 1500మంది ఈ వైరస్ లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరారు. 237 కేసులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్టుగా చైనా మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ సోకినవాళ్లు ప్రస్తుతం 1.321మంది ఉన్నట్టుగా వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. మరో రెండువేలమందివరకూ ఈ వైరస్ బారిన పడినట్టుగా అక్కడి వైద్య వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపధ్యంలో యుద్ధ ప్రాతిపదికన చైనా ప్రభుత్వం అంతర్గత టూరిస్ట్ కార్యకలాపాలను శుక్రవారం నుంచే నిలిపివేసింది.
సోమవారం నుంచి బైటి దేశాలనుంచి వచ్చే టూరిస్టులకు ప్రవేశం లేదు. గాలిద్వారా అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ ఇతర ప్రాంతాలకుకూడా వ్యాపించకుండా ఉండేందుకు చైనా ప్రభుత్వం ఆగమేఘాలమీద ఈ చర్యలు చేపట్టింది. పూర్తి స్థాయిలో ట్రావెలింగ్ ఏజెన్సీలు టిక్కెట్లు, హోటళ్ల బుకింగులను నిలిపివేశాయి.
చైనాలోని ప్రముఖ నగరాల్లో దాదాపుగా వెయ్యికి పైగా ఎస్.ఎస్.ఆర్.ఎస్ వైరస్ కేసుల్ని నిర్థారించారు. ఆసుపత్రులు కరోనా వైరస్ సోకిన రోగులతో నిండిపోతున్నాయి. హాంకాంగ్, మకావూ, నేపాల్, తైవాన్, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా, థాయ్ ల్యాండ్, వియన్నా, అమెరికా దేశాలకు ఈ వైరస్ వ్యాప్తిచెందినట్టు అంతర్జాతీయ, విదేశీ వ్యవహారాల అధికారులు ధృవీకరిస్తున్నారు.
చైనాలోనూ వూహన్ లో చిక్కుకుపోయిన 250 మంది వైద్య విద్యార్థుల్ని వెంటనే భారతదేశానికి రావడానికి అనుమతించాలని చైనాలోని ఇండియన్ ఎంబసీ అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. యూఎస్ లో కరోనా పాజిటివ్ రెండు కేసుల్ని గుర్తించి నిర్థారించారు. ఆస్ట్రేలియాలో నాలుగు కేసులు నిర్థారణ అయ్యాయి.
అట్టుడికిపోతోన్న చైనా..
పాకిస్తాన్ లో చైనానుంచి వచ్చిన వాళ్లందర్నీ పూర్తిగా ఐసోలేటెడ్ వార్డులో పర్యవేక్షణలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. హాంకాంగ్ లో వైద్య ఆత్యయిక స్థితిని ప్రకిటించింది అక్కడి ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక సౌకర్యాలతో, వైద్య సిబ్బందితో కూడిన ఆసోలేటెడ్ వార్డుల్ని అనేక ఆసుపత్రుల్లో ఏర్పాటుచేసి పరిస్థితిని సమీక్షిస్తోంది.
వైరస్ విపరీతంగా వ్యాపించిందన్న వార్తలతో ఊహాన్ నగరం అట్టుడికిపోతోంది. ముఖానికి పెట్టుకునే మాస్కులు, హ్యాండ్ గ్లౌవ్స్, ఫుల్ బాడీ ప్రొటెక్టింగ్ సూట్లకోసం జనం ఫార్మసీలముందు బారులు తీరారు. చాలామంది ప్రాణభయంలో నగరాన్ని విడిచిపెట్టి వెళ్లే ప్రయత్నాలు చేయడంతో గంటలకొద్దీ ట్రాఫిక్ స్తంభిస్తోంది.లూనార్ న్యూ ఇయర్ వేడుకలకోసం తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నవాళ్లుకూడా తోడవడంతో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగి ట్రాఫిక్ సమస్యలు అధికం అయ్యాయి.
చైనా రాజధాని బీజింగ్ లో అత్యాధునిక సదుపాయాలతోకూడిన వైరస్ ఇన్ ఫెక్షన్లకు పూర్తి స్థాయి వైద్యాన్ని అందించే మరో అధునాత హాస్పిటల్ ని నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావాలన్న ఆదేశాల ప్రకారం బహుశా మరో నెల రోజుల లోపలే ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావచ్చని చైనా మీడియా చెబుతోంది. ఇప్పటికే ఆసుపత్రి నిర్మాణంకోసం కావాల్సిన నిధులుకూడా మంజూరైనట్టు తెలుస్తోంది.
కరోనా వైరస్ వైరల్ గా వ్యాప్తి చెందిన నేపధ్యంలో చైనా ఆర్మీ సహాయచర్యలకోసం రంగంలోకి దిగింది. రోగులకు వైద్య సేవలు అందిస్తున్న ఓ డాక్టర్ కి కరోనా వైరస్ సోకి మృతిచెందినట్టుగా అధికారులు నిర్థారించారు. చైనాలో వైద్యులు, వైద్య సిబ్బందిలో నమోదైన మొట్టమొదటి కేసు ఇదని చైనా మీడియా వెల్లడించింది.