కరోనా కట్టడికి.. ఒక్క చుక్క టీకా..! త్వరలో అందుబాటులోకి..
By Newsmeter.Network Published on 4 April 2020 10:11 AM ISTకరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ మహమ్మారి వల్ల దాదాపు 209 దేశాలు అతలాకుతలమవుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు బ్రిటన్, చైనా, ఇటలీ, ఇండోనేషియా, భారత్ ఇలా అన్ని దేశాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రజలెవరూ బయటకు రాకుండా ఇండ్లకే పరిమితం చేయడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. భారత్‌లోనూ ఈనెల 14వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే వేలాది మందిని పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని దేశాలు వ్యాక్సిన్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డాయి.
తాజాగా కరోనా వైరస్‌ను నివారించేందుకు భారత్ బయోటెక్ కంపెనీ ఓ వినూత్నమైన టీకాను అభివృద్ధి చేసేపనిలో నిమగ్నమైంది. ఒక్క చుక్క ద్వారా కరోనాను కట్టడి చేసేలా వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఒక్క చుక్కను ముక్కు ద్వారా వేసుకోవాలని, ఈ టీకాపై మొదటి రెండో దశ మానవ ప్రయోగాలు కూడా పూర్తయినట్లు భారత బయోటెక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ టీకాను కోరోప్లూ అని పిలువటం జరుగుతుందని తెలిపారు. విస్కాన్సిన్ మాడిసన్ యూనివర్శిటీ, ప్లూజెన్ అనే వ్యాక్సిన్ కంపెనీలతో కలిసి అభివృద్ధి చేస్తున్నామని బయోటెక్ తెలిపింది. కరోనా వ్యాధి కారక వైరస్ జన్యు పదార్థాన్ని ఎం2ఎస్‌ఆర్‌లోకి జొప్పించి కొత్త వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నట్లు, ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు వీలుగా 30కోట్ల టీకాలను సిద్ధం చేస్తామని డాక్టర్ రాచెస్ ఎల్లా తెలిపారు. ప్లూజెన్ తయారీ పద్దతులతో భారత్ బయోటెక్‌లో టీకాలు సిద్ధం చేస్తామని తెలిపారు.
ఇదిలాఉంటే ఈ ఏడాది చివరి వరకు కోరోప్లూ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయని, ఎం2ఎస్‌ఆర్‌పై ఇప్పటికే నాలుగు ఫేస్-1, ఫేస్ -2 క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయని, వందలాది మందిపై జరిగిన ఈ ప్రయోగాల ద్వారా టీకా సురక్షితమేనని స్పష్టమైందని డాక్టర్ రాచెస్ ఎల్లా తెలిపారు. కోరోప్లూ జలుబు కారక వైరస్ యాంటీ జెన్‌లను కూడా ఉత్పత్తి చేస్తుందని, ఫలితంగా ఈ టీకా ద్వారా అటు కరోనా వైరస్‌కు, ఇటు ఇన్ ప్లుయెంజా వైరస్‌కు ప్రతిగా రోగ నిరోధక వ్యవస్థ పనిచేస్తుందని ప్లూజెన్ సహ వ్యవస్థాపకుడైన గాబ్రియెల్ న్యూమన్ తెలిపారు. ముక్కు ద్వారా కోరోప్లూను అందించడం వల్ల కరోనా, ఇన్‌ప్లుయెంజా వైరస్‌లు సహజసిద్ధంగా శరీరంలోకి ప్రవేశించే దారిలోనే మందు అందుబాటులోకి వస్తుందని, ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ పలు రకాలుగా స్పందిస్తుందని వివరించారు. కోరోప్లూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంతో పాటు జంతువులపై పరీ క్షలు జరిపేందుకు యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్‌లో మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత భారత్ బయోటిక్ హైదరాబాద్ కేంద్రం మనుషుల్లో టీకా సామర్థ్యం, భద్రతలపై పరీక్షలు మొదలు పెడుతుందని ఎల్లా తెలిపారు.