తెలంగాణ రాష్ట్రంలోకి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నారు. కోవిద్-19 వైరస్ హైదరాబాద్ లోకి చొరబడకుండా విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ఈ వైరస్ మహమ్మారి పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. దేశాలకు వ్యాప్తి చెందకుండా ఎన్నో సూచనలు ఇస్తోంది. ఇన్ఫెక్షన్ అన్నది ఇతర దేశాలకు వ్యాప్తి చెందకుండా విమానాశ్రయాల్లో పెద్ద ఎత్తున స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించమని కోరారు. అందులో భాగంగానే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో అధికారులు పలు దేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ వైరస్ భారతదేశంలో ప్రబలకుండా చూడాలని.. కోవిద్-19 వైరస్ సోకిన వారికి ప్రత్యేకంగా చికిత్స అందించే సెంటర్లన్నవి చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. భారత్ లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో వైరస్ ప్రబలితే అడ్డుకోవడం చాలా కష్టమని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మందుల విషయంలో సరికొత్త మార్గదర్శకాలు ఇస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ప్రత్యామ్నాయ మందులకు సంబంధించి సరైన అవగాహన ఉంటే వైరస్ ప్రబలకుండా అరికట్టవచ్చని ఆయన అంటున్నారు.

ప్రత్యేక దృష్టి..

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఇటలీ, ఇరాన్ దేశాల నుండి వచ్చే ప్రయాణీకుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవలి కాలంలో ప్రయాణీకుల ట్రావెల్ హిస్టరీలో ఇరాన్, ఇరాక్ దేశాలు ఉంటే వారికి స్క్రీనింగ్ టెస్టులు చేయించి పంపుతున్నారు. స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్న ప్రయాణీకుల సంఖ్య గత వారంతో పోలిస్తే భారీగా పెరిగిపోయింది.

ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ ఛీఫ్ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ.. ‘తాము ఎయిర్ పోర్ట్ లో యూనివర్సల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని.. కోవిద్ కేసులు ఇరాన్, ఇటలీ దేశాలలో అధికమవడంతో అక్కడికి వెళ్లి వచ్చిన ప్యాసెంజర్లకు కూడా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని’ అన్నారు.

గాంధీ ఆసుపత్రి మైక్రో బయాలజీ ప్రొఫెస్సర్ డాక్టర్ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. ‘వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ 14 రోజులని.. ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఈ వైరస్ సోకి.. అతన్ని బలహీన పరచడానికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే పడుతుందని’ చెప్పుకొచ్చారు. గాంధీ ఆసుపత్రి లోని మైక్రోబయాలజీ ల్యాబ్ లో కోవిద్-19 శాంపుల్స్ ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం తాము ల్యాబ్ లో మూడు షిఫ్టులు పనిచేస్తున్నామని.. ఒక్క రోజులో 30 శాంపుల్స్ కు టెస్టులు నిర్వహించగలుగుతున్నామని అన్నారు.

వికటించే అవకాశం..

కోవిద్-19కు మందులుగా ఆయుర్వేద, యునానీ మందులు వాడాలన్న ప్రచారాన్ని ఎక్స్పర్ట్స్ తప్పుబడుతున్నారు. ఏది పడితే అది వాడితే మనిషి ప్రాణాలకే ప్రమాదం అని.. వికటించే అవకాశం కూడా ఉండొచ్చని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందని.. మిగిలిన మందులతో పోలిస్తే చాలా తక్కువ ధరకే లభిస్తాయని రోగులు ఈ మందుల వెంట పడే అవకాశం ఉందని.. ఏ మాత్రం ప్రభావం చూపుతాయో అసలు ఊహించలేమని నిపుణులు అంటున్నారు. యునానీ, హోమియోపతీ ఆసుపత్రులు ఇప్పటికే తమ వద్ద కోవిద్-19 వైరస్ ను నియంత్రించే పిల్స్ ఉన్నాయంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.