కరోనా వైరస్ మరింత ముదిరే అవకాశం ఉంది: ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు
By సుభాష్
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. వేసవి కాలంలో ఈ వైరస్‌ను నియంత్రించకపోతే శీతాకాలంలో ఇది మరింత ముదిరే అవకాశం ఉందని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆస్ట్రేలియాకు చెందిన కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన పరిశోధనల ప్రకారం.. వేసవి సగటు ఉష్ణోగ్రతతో పోలిస్తే చల్లటి వాతావరణంలో వైరస్ ఎక్కువ కాలం జీవితంచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే గాజు పరికరం, కరెన్సీ నోట్లు, మొబైల్ టచ్ స్క్రీన్‌పై దాదాపు 28 రోజుల వరకు వైరస్ నిలిచి ఉండే అవకాశం ఉందని, ఇది చాలా ప్రమాదకరమని పరిశోధకులు తెలిపారు.
అయితే వేసవి సగటు ఉష్ణోగ్రతతో పోలిస్తే తేమతో నిండిన వాతావరణంలో కోవిడ్ ఐదు రేట్లు బలంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
ముఖ్యంగా కరోనా వచ్చిన వ్యక్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు విడుదలయ్యే వైరస్ కణాలు ఉపరితలాలపై ఎక్కువ సమయం నిలిచే ఉంటాయని అన్నారు. 40 డిగ్రీల సెల్సియస్ వద్ద కొన్ని ఉపరితలాలపై కరోనా వైరస్ ఒక రోజు కూడా జీవించలేదని, కానీ వాతావరణం చల్లబడినప్పుడు ఎక్కువ రోజులు బతికి ఉండే అవకాశం ఉందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.