'కరోనా వైరస్' ఎక్కువగా సోకేది.. ఆ రక్తం గ్రూపువాళ్లకేనట..!
By Newsmeter.Network Published on 19 March 2020 11:02 AM GMTప్రపంచ దేశాలకు కరోనా వైరస్ భయం పట్టుకుంది. వైరస్ ప్రభావంతో దాదాపు 161 దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భారత్‌లోనూ ఈ వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే చైనా శాస్త్రవేతలు సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. ఎక్కువ ఏ గ్రూపు రక్తం ఉన్నవారికి ఈ వైరస్ త్వరగా సోకుతుందో..? ఏ గ్రూపు రక్తంవారికి ఈ వైరస్ సోకితే ఎక్కువ శాతం చనిపోయే అవకాశం ఉంటుందో అనే విషయాలపై అధ్యనం చేశారు. ఈ అధ్యయనం కరోనా వైరస్‌కు కేంద్రమైన వుహాన్‌లో సాగింది. గ్రూప్ 'ఎ' రక్తం ఎవరికైతే ఉంటుందో.. వారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు.
గ్రూప్ 'ఎ' రక్తం ఉన్నవారు కరోనా వైరస్‌తో చనిపోయే ప్రమాదాలు ఎక్కువేనంట. తరువాతి స్థానంలో గ్రూప్ 'ఒ' ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్రూప్ 'ఒ' రక్తం ఉన్నవారు 25శాతం వరకే మరణించే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. వుహాన్‌లోని జనాభాలో 32శాతం మంది టైప్ ఒ రక్తం ఉన్నవారే. రక్తం టైప్‌ను బట్టి వైరస్ సోకడంతో ఎందుకు తేడా ఉంటుందో పరిశోధకులు చెప్పలేక పోతున్నారు.
పరిశోధన సాగిందిలా..
చైనాలో కరోనా వైరస్ సోకినట్లు గుర్తించిన 2173 మందిని హుబెయిలోని మూడు ఆస్పత్రుల నుంచి పరిశోధకులు తమ పరిశోధనలోకి తీసుకున్నారు. వీరిలో తరువాత 206 మంది చనిపోయారు. అదే రీజియన్‌లో వైరస్ భారిన పడిన వారిని వైరస్ సోకని 3694 మందితో పోల్చి పరిశోధనలు సాగించారు. చనిపోయిన 206 మంది రోగుల్లో 85 మందికి టైప్ 'ఎ' రక్తం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇది మొత్తం మరణాల్లో 41శాతంతో సమానం. 11మిలియన్ జనాభా ఉన్న వుహాన్ నగరంలో ఆరోగ్యవంతుల్లో 34శాతం మందికి టైప్ ఎ రక్తం ఉంది.
మృతుల్లో 52మంది టైప్ ఒ రక్తం ఉన్నట్లు తేలింది. మరణాల్లో వీరికి మరణాలు నాలుగో వంతు వస్తాయి. సాధారణ పరిస్థితుల్లో 32శాతం మందికి టైప్ ఒ రక్తం ఉంది. ఒ గ్రూపు రక్తం ఉన్న వారితో పోల్చిచూస్తే ఒ గ్రూపు రక్తం కాని వారిలో కరోనా మృత్యుగండం చాలా తక్కువని, పరిశోధకులు నిర్ధారించారు. అలాగే ఎ గ్రూపు రక్తం కాని వారి కన్నా ఎ గ్రూపు రక్తం ఉన్న వారిలో రిస్కు చాలా ఎక్కువని పేర్కొన్నారు. అలా అని టైప్ ఎ రక్తం ఉన్నంత మాత్రాన నూటిన నూరుశాతం వైరస్ సంక్రమిస్తుందని ఆందోళన చెందవలసిన పని లేదని పరిశోధకులు సూచిస్తున్నారు.