ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా మహమ్మారి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా బాధితుల సంఖ్య 350కి చేరువలో ఉండగా ఆరుగురు మృతి చెందారు. దీనిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పీడిత జిల్లాలను ఈనెలాఖరు వరకూ లాక్ డౌన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 75 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాయి. ఆ 75 జిల్లాల్లోనూ అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సర్వీసులు మూతపడనున్నాయి. బస్సులు, రైళ్ల ప్రయాణాలు సైతం ఆగిపోనున్నాయి.

75 జిల్లాలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్ లు, కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కార్యదర్శులతో చర్చించాకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కరోనాను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ చేయడం తప్ప మరో మార్గం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ స్కూళ్లు, కాలేజీలకు నెలాఖరు వరకూ సెలవులిచ్చారు. సాఫ్ట్ వేర్లకు వర్క్ ఫ్రమ్ ఇచ్చారు. కేంద్రం విడుదల చేసిన జాబితాలో తెలంగాణలో 5 జిల్లాలు, ఆంధ్రాలో మూడు జిల్లాలను లాక్ డౌన్ చేయాల్సిందిగా కేంద్రం ఆదేశాలిచ్చింది.

ఏపీలో కృష్ణా, ప్రకాశం, విశాఖ జిల్లాలు లాక్ డౌన్ అవనున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు లాక్ డౌన్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ వరకూ తెలుగు రాష్ట్రాల్లోని 8 జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కేంద్రం ఎంపిక చేసిన 67 జిల్లాలు లాక్ డౌన్ అవ్వనున్నాయి.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.