తెలంగాణలో కరోనా వైరస్‌పై హైఅలర్ట్‌ కొనసాగుతోంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇప్పటి వరకు 41,102 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. నిన్న ఒక్క రోజే 3,517 మందికి అధికారులు స్క్రీనింగ్‌ చేశారు. 516 మంది స్వచ్ఛంధంగా టెస్టులు చేయించుకున్నారు. కాగా గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లో 261 మంది కరోనా అనుమానితులు ఉన్నారు. ఇప్పటి వరకు గాంధీ ఆస్పత్రిలో ఉన్న 261 మందికి పరీక్షలు నిర్వహించారు వైద్యులు. టెస్టులు చేసిన వారిలో 239 మందికి నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. ఇప్పటి వరకు అయితే తెలంగాణలో ఒక కరోనా పాజిటివ్‌ కేసు మాత్రమే నమోదు అయ్యింది.

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాపించకుండా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏ దేశం నుంచి వచ్చినా తప్పనిసరిగా కరోనా పరీక్ష, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఖచ్చితంగా థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కొవిడ్‌-19 ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

గాంధీ ఆస్పత్రిలో ఉన్న క రోనా బాధితుడు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. తాజా పరీక్షల్లో నెగిటివ్‌ రిపోర్టు వచ్చినట్టు వైద్యులు వెల్లడించారు.

కాగా బెంగళూరు వాసికి కరోనా సోకినట్టు కర్నాటక ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇవాళ్టి నుంచి బెంగళూరులోని అన్ని స్కూళ్లు మూసివేయాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్కూళ్లు తెరవద్దని కర్నాటక సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీ పాఠశాలలు వారం పాటు మూసివేయాలని సూచించింది.

మరో వైపు తమిళనాడు కరోనా వైరస్‌ వణికిస్తోంది. మలేషియా నుంచి వచ్చిన యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు తేల్చారు. వెల్లూరు జిల్లాలోని ఇటలీ దంపతులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.