డిప్యూటీ సీఎంతో సహా 8 మంది ఎమ్మెల్యేలకు కరోనా

By సుభాష్  Published on  15 Sep 2020 2:28 AM GMT
డిప్యూటీ సీఎంతో సహా 8 మంది ఎమ్మెల్యేలకు కరోనా

దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు కరోనా పాజిటివ్‌ తేలింది. ఆదివారం రాత్రి ఆయనకు కాస్త జ్వరం ఉండటంతో ఇంటికే పరిమితమైన ఆయన.. సోమవారం నాటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయితే వైద్యుల సూచనల మేరకు కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సిసోడియా స్వయంగా ప్రకటించారు. తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లుతెలిపారు.

హోం ఐసోలేషన్‌లో ఉంటున్న తనకు మీ అందరి ఆశీస్సులతో త్వరగా విధుల్లోకి రావాలని ఆయన ట్వీట్‌ చేశారు. మరో వైపు ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు కోవిడ్‌ పరీక్షలు చేయగా, డిప్యూటీ సీఎం సిసోడియాతో కలిపి ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు పాజిటివ్‌ వచ్చినట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

తాజాగా ఢిల్లీలో నెల రోజుల కితం వరకు తక్కువ కేసులు నమోదు కాగా, ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే 3,229 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 26 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఢిల్లీలో కేసుల సంఖ్య 2,21,533 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒక్క రోజే 3,374 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఢిల్లీలో మొత్తం మరణాల సంఖ్య 4,770కి చేరింది.



Next Story