కరోనా వైరస్ వస్తే ఈ చైనీయులకు పండుగే.!

By అంజి  Published on  5 Feb 2020 3:19 AM GMT
కరోనా వైరస్ వస్తే ఈ చైనీయులకు పండుగే.!

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే సిగరెట్ కాల్చుకోవడానికి బోలెడు నిప్పు దొరికిందని ఇంకొకడు సంబరపడిపోయాడట. చైనాలోని సాఫ్ట్ వేర్ కంపెనీల పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. కరోనా వైరస్ బారిన పడి మొత్తం చైనా ఒక జైలుగా మారిపోయింది. ముఖ్యంగా వుహాన్, హుబై వంటి ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లకు పరిమితమైపోయారు . రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఆఫీసుల్లో హాజరు అట్టడుగు స్థాయికి చేరింది. కానీ ఒక్కరు మాత్రం ఈ పరిస్థితని చూసి సంబరపడిపోతున్నారు. వాళ్లెవరయ్యా అంటే చైనాలోని సాఫ్ట్ వేర్ సంస్థలు.

“హమ్మయ్య... ఇప్పుడు మాకు మా వర్క్ ఫ్రమ్ హోమ్ వ్యవస్థతో ప్రయోగాలు చేసే అవకాశం వచ్చింది. ఉద్యోగులందరూ ఇళ్లలోనుంచే ఆన్ లైన్ లోకి వచ్చి పనిచేస్తారు. దీనిపై కావలసినన్ని ప్రయోగాలు చేసుకోవచ్చు.” అని ఆ కంపెనీలు సంబర పడుతున్నాయట. ఎందుకంటే ప్రపంచంలోని అతి పెద్ద “వర్క్ ఫ్రం హోం” ప్రయోగం ఇదే కావచ్చునట. లక్షలాది మంది ఉద్యోగులు ఇంటికే పరిమితమై అక్కడ్నుంచే పనిచేసే అవకాశం మళ్లీ మళ్లీ రాదు. అందుకే సాఫ్ట్ వేర్ సంస్థలు మహా ఆనందంతో ఉన్నాయట. హాంకాంగ్, షాంఘై వంటి బిజినెస్ డిస్ట్రిక్టులు కూడా ఈ ప్రయోగాలను ముమ్మరంగా చేస్తున్నాయట. కస్టమర్లు, క్లైంట్లతో విడియో చాట్లు, కంపెనీలతో స్కైప్ కాల్స్, ఉద్యోగులతో విడియో కాన్ఫరెన్సులు నిర్వహించేస్తున్నాయట. ప్రస్తుతం చైనీస్ కొత్త ఏడాది పండుగల సెలవుల్లో ఉన్న ఉద్యోగులకు అడక్కుండానే సెలవులు ఇచ్చేస్తున్నారట.

వర్క్ ఫ్రం హోం వల్ల పని తీరు మెరుగుపడుతుందని బోలెడు అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. 2015 లో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ చేసిన ఒక అధ్యయనం ప్రకారం చైనాలో వర్క్ ఫ్రం హోం పద్ధతిని అమలు చేస్తే పనితీరు 13 శాతం మెరుగుపడిందట. ఒక జిమ్ అయితే కస్టమర్లు రావడం అసాధ్యం కనుక ఇంట్లోనే వ్యాయామం చేసి, ఆ విడియోలను ఆన్ లైన్ లో పోస్ట చేయమని కోరుతోందట. అవును లెండి. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉంటాయి మరి.

Next Story