అమెరికాలో కరోనా మృతులు 10
By సుభాష్
అమెరికాను కరోనా వైరస్ కలవరపరుస్తోంది. ఆ దేశంలో కొవిడ్-19 కారణంగా ఓవైపు మరణాలు, మరో వైపు నిర్ధారిత కేసుల సంఖ్య పెరుగతూపోతుంది. మూడు రోజుల వ్యవధిలోనే మృతుల సంఖ్య 10కి చేరింది. పాజిటివ్ కేసులు 90 దాటాయి. పరిస్థితుల రీత్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఫార్మా రంగా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఉద్యోగికి కరోనా సోకిందనే వార్తతో వాషింగ్టన్‍లోని హోమ్‍ల్యాండ్ సెక్యూరిటీ కార్యాలయాన్ని మూసివేశారు. ప్రవాస భారతీయురాలు సీమా వర్మ ను వైట్‍హౌస్ కరోనా వైరస్ టాస్క్ఫోర్స్ లో సభ్యురాలిగా ట్రంప్ నియమించారు. ఈ వైరస్ కారణంగా వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ విధించారు. అలాగే పలు అమెరికన్ నగరాల్లోనూ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని విధించారు. ఒక్క వాషింగ్టన్‌లోనే ఇప్పటివరకు 39 కరోనా కేసులు నమోద య్యాయి. అటు శాన్‌ఫ్రాన్సిస్కోలో గత నెలలోనే అక్కడి మేయర్ లండన్ బ్రీడ్ ఎమర్జెన్సీ విధించారు. దీంతో కరోనాను నియంత్రించేందుకు ఫెడరల్ ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులతో పాటు అవసర మైన మరింత సిబ్బందిని సమకూరుస్తుంది.
మరోవైపు చైనాలో తగ్గుముఖం పట్టిన ఈ వైరస్ భూతం ఇతర దేశాలకు విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ వైరస్ గుట్టు తెలుసుకునే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందడుగు వేసింది. ఈ వైరస్ పుట్టుపూర్వోత్తరాలు, తద్వారా నివారణ మార్గం తెలుసుకునే క్రమంలో తాము కీలక సమాచారం రాబట్టినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
కరోనా వైరస్ జన్యు క్రమాన్ని గుర్తించామంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పాలిమిరేజ్ చైన్ రియాక్షన్, సీరాలాజికల్ అనాలిసిస్ పై పరిశోధనలు కొనసాగుతున్నాయని పేర్కొంది.