కరోనా పుట్టిల్లు ఏది ?
By రాణి Published on 14 March 2020 10:52 AM ISTప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ మొదటి కేసు చైనాలో బయటపడ్డప్పటికీ, అది కచ్చితంగా ఎక్కడ ఆరంభమైందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కరోనా వైరస్ సోకిన జీరో పేషంట్ అంటే వైరస్ బారినపడిన మొదటి వ్యక్తి ఎవరనే దానిపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అయితే చైనాలోని వుహాన్ నగరంలో తొలి కేసు నిర్ధారణ కావడం, అక్కడ మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వుహాన్‌లోనే ఈ వైరస్ బయటపడ్డట్లు అనుమానిస్తున్నారు. ఈ సమయంలోనే కరోనా వైరస్ పుట్టుకపై కొత్త వాదన మొదలైంది. అసలు కొవిడ్-19వైరస్ చైనాకు రావడానికి అమెరికా కుట్ర పన్నిందని తాజాగా చైనా ఆరోపించింది. అమెరికా ఆర్మీనే ఈ వైరస్‌ను చైనాకు తీసుకొచ్చిందనే అనుమానం వ్యక్తం చేస్తూ తాజాగా చైనా అధికారులు ఆరోపణ చేశారు. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిజియన్ జాహో తన ట్విటర్ పేజీలో ఈ ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటికే చైనా-అమెరికా మధ్య ట్రేడ్ వార్ నడుస్తున్న సమయంలో ఈ మాటల యుద్ధం మరింత ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తోంది.
Also Read : 90 నిమిషాలకు ఒకసారి మొబైల్ ఫోన్‌ను శుభ్రం చేసుకోవాల్సిందేనా..!
అంతేకాదు ఈ వైరస్‌కు అధికారికంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కొవిడ్-19’ అని పేరు నిర్ణయించినప్పటికీ..అమెరికన్లు మాత్రం ‘చైనా వైరస్’గానే సంభోదిస్తున్నారు. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర ఉన్నతాధికారులు కూడా దీన్ని ‘వుహాన్ వైరస్’, ‘చైనా వైరస్’గానే అభివర్ణించడం చైనా జీర్ణించుకోలేకపోతోంది. దీనికితోడు, కరోనా వైరస్ సోకిన తొలి వ్యక్తిని గుర్తించడంలో చైనా విఫలమైందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరక్టర్ చేసిన వ్యాఖ్యలతో చైనా మరింత ఆగ్రహానికి గురయ్యింది.
గత అక్టోబరులో వుహాన్‌లో ‘అంతర్జాతీయ మిలటరీ ప్రపంచ క్రీడలు’ జరిగాయి. దాదాపు వంద దేశాలు పాల్గొన్న ఈ క్రీడల్లో అమెరికన్ సైన్యం కూడా పాలుపంచుకుంది. దీన్ని ఆధారంగా చేసుకొని తాజాగా చైనా ఈ రకమైన ఆరోపణలు చేసింది. ఇదిలా ఉంటే, దీనిపై చైనాలో ఉన్న అమెరికన్ ఎంబసీ మాత్రం స్పందించలేదు.
Also Read : తనకు కరోనా లక్షణాలు లేవు.. అందుకే..! : ట్రంప్
చైనీస్ అధికారులు కరోనా వైరస్ తొలి కేసును డిసెంబర్ 31వ తేదీన గుర్తించారు. వుహాన్ లోని సముద్ర ఉత్పత్తులు, జంతు మాంసం అమ్మే మార్కెట్ నుంచి పుట్టిన వైరస్ ద్వారా న్యూమోనియా కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. చైనాతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా నమోదు అయిన మొత్తం కేసులలో 82 శాతం వుహాన్ ప్రాంతం నుంచి నమోదైనవే అని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ సేకరించిన లెక్కల్లో పేర్కొంది. అయితే, లాన్సెట్ మెడికల్ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనంలో తొలి కరోనా వైరస్ డిసెంబర్ 01వ తేదీన నమోదైందని, ఆ కేసుకి మార్కెట్‌కి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. ఏది ఏమైనా వైరస్ పుట్టినది నిజం.. మనుషులు పోతున్నది నిజం..