వైరస్ అలర్ట్స్ కారణంగా పర్సనల్ విషయాలు బయటపడుతున్నాయట

By సుభాష్  Published on  11 March 2020 2:41 PM GMT
వైరస్ అలర్ట్స్ కారణంగా పర్సనల్ విషయాలు బయటపడుతున్నాయట

కరోనా వైరస్ బారి నుండి ప్రజలను తప్పించడానికి ఇప్పటికే పలు దేశాలకు సంబంధించిన అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచనలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా రోగులకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుంటున్నప్పుడు కొన్ని చాలా పర్సనల్ విషయాలు బయటకు రావడంతో కొందరు అధికారుల తీరు పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలు చోటుచేసుకుంది దక్షిణ కొరియాలో..!

ప్రస్తుతం దక్షిణ కొరియాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. చైనా తర్వాత ఎక్కువ మంది కరోనా వైరస్ బాధితులు ఉంది అక్కడే..! ఇప్పటిదాకా 7500 మందికి కరోనా వైరస్ సోకింది. రెండు లక్షల మందికి పైగా సోకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్థానిక అధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్స్ సెల్ ఫోన్లకు పంపుతున్నారు. వైరస్ సోకిన వ్యక్తులు ఎక్కడికెక్కడికి వెళుతున్నారు అన్న విషయం కూడా స్పష్టంగా చెబుతున్నారు. పేషెంట్స్ వైరస్ సోకకముందు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో కూడా డేటా వాళ్ళ దగ్గర ఉంది.

ఒక్కొక్కరికి సంబంధించిన డైలీ షెడ్యూల్, ఒక్కో నిమిషం.. ఒక్కో అప్డేట్.. ఇళ్లల్లో ఉంటున్న వాళ్ళ వివరాలు.. ఏదైనా షాపుకు వెళ్తే అక్కడ పనిచేసే వ్యక్తులు ఇలా మొత్తం సమాచారం అధికారుల చెంతనే ఉంది. చాలా వరకూ సమాచారాన్ని మున్సిపల్ వెబ్సైట్స్ లో పెట్టడంతో చాలా మందికి చెందిన వ్యక్తగత సమాచారం ఇతరులకు తెలిసిపోతోందట. ఆయా వ్యక్తులు ఎవరిని కలిశారు అన్నది చాలా సులభంగా తెలిసిపోతూ ఉండడంతో వారితో సంబంధాలను ఏర్పరచుకున్నారు అంటూ తెలుసుకుని మరీ కొందరిని తిడుతున్నారు. చాలా వరకూ వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరిపోయింది. ఆ దేశ హ్యూమన్ రైట్స్ కమీషన్ కూడా ఈ విషయాన్ని తప్పుబడుతోంది.

కరోనాతో ఇప్పటికే వ్యక్తులు బాధపడుతూ ఉంటే.. వ్యక్తిగత డేటాను లీక్ చేయడం వలన మానసికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. కరోనా సోకిన ఇద్దరు మహిళలకు వేరే వ్యక్తులతో లైంగిక సంబంధాలు ఉన్నాయని తెలియడంతో వారిని సామాజిక మాధ్యమాల్లో తెగ తిడుతూ ఉన్నారు.

ఓ మహిళకు ఇటీవలే వైరస్ పాజిటివ్ అని వచ్చింది. ఆమెతో పాటూ ఓ వ్యక్తి కూడా ఒకే చోట తిరిగాడని గవర్నమెంట్ డేటాలో బయటపడింది. ఆమె ఇంకో వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగారో మొత్తం ఒకేలా ఉండడం.. అలాగే షించియోంజీ ఈవెంట్ లో ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా హాజరయ్యాడని మేయర్ తెలపడంతో ఆమెకు పలువురు మెసేజీలు చేశారు. దీంతో ఆమె సోషల్ మీడియాలో 'తాను మానసికంగా చాలా కృంగిపోయానని.. శారీరకంగా ఉన్న బాధతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది' అని ఆమె పోస్ట్ చేసింది.

ఆ తర్వాత ఆమె తన అకౌంట్ ను ప్రైవేట్ చేసేసింది. కొరియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన మైఖేల్ హర్ట్ మాట్లాడుతూ ఇలాంటి సమయంలో వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లడం చాలా దురదృష్టకరం.. అలాగే ప్రమాదకరం అని అన్నారు. చాలా జాగ్రత్తగా ఒక్కొక్కరి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ని దాచాలని అన్నారు.

హెల్త్ మినిస్ట్రీ సివిల్ సర్వెంట్ ను కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఆమె 'జిమ్' క్లాసులకు వెళ్లిందని.. అలా వెళ్ళినప్పుడు కరోనా లక్షణాలు ఉన్న జిమ్ శిక్షకుడు ఆమెకు దగ్గరగా వచ్చాడు. అలా వచ్చిన ఆ వ్యక్తి నుండి ఆమెకు కరోనా లక్షణాలు సోకాయి. దేశమంతా కరోనాతో బాధపడుతున్న సమయంలో జిమ్ కు వెళ్లడం అవసరమా అని ఆమెను విమర్శించడం మొదలుపెట్టారు.

ఆమె ఎటువంటి తప్పు చేయలేదని.. ఎక్కువ మందితో కలవద్దు, ప్రజలు గూమికూడే ప్రదేశాలకు వెళ్ళకండని ప్రభుత్వం సూచనలు చేయడానికంటే ముందే ఆమె జిమ్ కు వెళ్లిందని సెంట్రల్ డిజాస్టర్ అండ్ సేఫ్టీ కౌంటర్మెజర్ అధికారులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఏది ఏమైనా చాలా మందికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు బయటకు వస్తుండడం చాలా మందిని కలవరపెడుతోంది.

Next Story