కరోనా వార్డును పరిశీలించిన మంత్రి ఈటల

By సుభాష్  Published on  8 March 2020 11:11 AM GMT
కరోనా వార్డును పరిశీలించిన మంత్రి ఈటల

కరోనాపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. హైదరాబాద్‌లో ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. కరోనాపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది. తాజాగా ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సందర్శించారు. కరోనా వార్డులను పరిశీలించారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. కరోనా కోసం వివిధ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేస్తున్న ఐసోలేషన్‌ వార్డులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.

Minister Etela

నిన్న గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ సోకిన వ్యక్తిని స్వయంగా పరామర్శించారు. కరోనా గురించి ఎలాంటి భయాందోళనలు చెందవద్దని భరోసా ఇచ్చారు. ఆస్పత్రిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. తాజాగా కేరళలో మరో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. అలాగే ఆయా జిల్లా కేంద్రాల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయాలని ఇది వరకే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఈటల.

Next Story