ఇది కరోనా వైరస్ మందేనా.? వాడితే కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చా.?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Jan 2020 9:14 PM ISTకరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్. చైనా లో బయటపడ్డ ఈ వైరస్.. పొరుగు దేశాలన్నింటిని వణికిస్తోంది. భయంకరమైన ఈ వైరస్ బారిన పడితే చావు తప్ప ప్రత్యామ్నాయం లేదన్న ప్రచారం ఇటు సోషల్ మీడియాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. కొత్తగా కనుగొన్న ఈ వ్యాధికి నివారణ తప్ప మందు ఇంకా కనుగొనబడలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, జాగ్రత్తగా ఉండడం, ప్రధానంగా చైనా నుంచి వచ్చిన వారికి ప్రత్యేక పరీక్షలు చేసిన తర్వాతే వాళ్లతో సన్నిహితంగా మెలగాలని సూచిస్తున్నారు.
వైద్యపరంగా, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన నేటి సమాజంలో ప్రాణాంతక వ్యాధులకు సైతం ఎప్పటికపుడు మందులను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఏదైనా కొత్త వైరస్ బయట పడింది అంటే చాలు.. దాని బారిన పడకుండా నివారణ మార్గాలు, చికిత్స పద్ధతుల గురించి జనం ఆశగా ఎదురు చూడడం, ఇంటర్ నెట్లో సెర్చ్ చేయడం సహజంగా జరుగుతోంది. ఇప్పుడు కరోనా విషయంలో కూడా అదే జరుగుతోంది. సోషల్ మీడియా చైతన్యం అనూహ్యంగా పెరగడంతో జనం ప్రధానంగా ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందేమో అని నిరంతరం ఫాలో అవుతున్నారు.
కరోనా వైరస్ కు ముందు జాగ్రత్త ఈ మందు అంటూ ప్రచారం :
ఈ క్రమంలోనే ఈ మందు వాడితే కరోనా వైరస్ సోకదని, భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ సూచన చేసిందని సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతోంది.
ఆ పోస్టు సారాంశం ఇలా ఉంది..
ముఖ్యగమనిక:-
కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా ఆర్సేనికం ఆల్బమ్-30 అనే హోమియో మందును పరగడుపున మూడు రోజులు పాటు తీసుకోవలసినదిగా భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. దయచేసి ఈ మెసేజ్ ను అందరికి ఫార్వర్డ్ చేయండి.
ఆర్సేనికం ఆల్బమ్-30 అనే ఈ హోమియో మందును మూడు రోజులపాటు పరగడుపున తాగితే ఇక కరోనా వైరస్ మన జోలికి రా దు అన్నది ఈ పోస్టు సారాంశం. ఈ రైటప్ తో పాటు ఆర్సేనికం ఆల్బమ్-30 హోమియో మందు బాటిల్ ఇమేజ్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఈ రైటప్ లో భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిందని పేర్కొనడం.. సోషల్ మీడియా వాడకందారుల్లో ఆలోచన రేకెత్తిస్తోంది.
నిజ నిర్ధారణ :
వాస్తవానికి ఆర్సేనికం ఆల్బమ్-30 అనే ఈ మందు కొత్తగా కనిపెట్టిందేమీ కాదు. ఈ మందు ప్రధానంగా.. డిప్రెషన్, అజీర్ణం, ఆందోళన, అలర్జీ వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడుతారు.
ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రకటన :
వాస్తవానికి భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద కరోనా వైరస్ నివారణకోసం పనిచేస్తున్న పలు రీసెర్చ్ కౌన్సిల్స్ జనవరి 29వ తేదీన ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కరోనా బారిన పడకుండా ఉండేదుకు తీసుకోవాల్సిన వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన జాగ్రత్తలు సూచించడంతో పాటు.. ఆయుర్వేద, యునాని, హోమియోపతికి సంబంధించిన సంప్రదాయ వైద్య విధానాలకు చెందిన పలు మందుల వివరాలనుకూడా వెల్లడించాయి. అవి కరోనా వైరస్‌కు చికిత్స చేసే మందులు కాకున్నా.. దాని లక్షణాలను బట్టి ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు ఆ మందులు వాడాలని సలహాలు ఇచ్చారు. అయితే.. ఆ మందుల జాబితాలో 'ఆర్సేనికం ఆల్బమ్-30' మాత్రం లేదు.
ప్రచారం : ఈ మందు మూడు రోజులపాటు పరగడుపున వాడితే కారణం వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చు.
వాస్తవం : ఆర్సేనికం ఆల్బమ్-30 అనే మందు హోమియోపతిక్ మెడిసిన్. ఇది కరోనా నివారణ మందు కాదు.
కంక్లూజన్ : భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రీసెర్చ్ బృందాలు కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొన్ని రకాల మందుల వివరాలు ప్రకటించాయి. కానీ, ఆ జాబితాలో 'ఆర్సేనికం ఆల్బమ్-30' లేదు.
- సుజాత గోపగోని.