చైనాలో పెరిగిన కరోనా మృతులు..కోలుకున్న 892 మంది

By రాణి  Published on  5 Feb 2020 6:57 AM GMT
చైనాలో పెరిగిన కరోనా మృతులు..కోలుకున్న 892 మంది

చైనాలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 490కి చేరింది. ఇంకా 24,324 మందికి కరోనా వైరస్ సోకినట్లు అక్కడి వైద్యులు ధృవీకరించారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వాధికారులే అధికారికంగా వెల్లడించారు. కరోనా వైరస్ సోకి మంగళవారం ఒక్కరోజే 65 మంది చనిపోవడం అక్కడి ప్రజలతో పాటు ప్రపంచ దేశాలను సైతం కలవరపెడుతోంది. దీనిని బట్టి చూస్తే వ్యాధి తీవ్రత, విఝృంభణ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఉన్న కరోనా బాధితులు కాకుండా కొత్తగా 3,887 మందికి కరోనా ఇన్ఫెక్షన్ లక్షణాలున్నట్లుగా సమాచారం. వీరిలో 431 మంది ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా..మంగళవారం 262 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. కోలుకున్న వారి సంఖ్య కంటే..వైరస్ బారిన పడి బాధపడుతున్న వారి సంఖ్యే అధికంగా ఉంది. మొత్తం 892 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని ఇంటికి చేరుకోగా..సుమారు 1.85 లక్షల మంది అనుమానితులు ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు.

కరోనా వైరస్ బాధితులకు ప్రత్యేకంగా చికిత్స అందించడం కోసం వుహాన్ నగర శివారులో చైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిన 9 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రిని నిర్మించింది. ఇప్పుడు కరోనా బాధితుల కోసం 1300 పడకలతో కూడిన మరో ఆస్పత్రిని నిర్మించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకూ చైనా లోని హాంకాంగ్ లో 18 మందికి, మకావులో 10 మందకి, తైవాన్ లో 11 మందికి ఈ వైరస్ సోకినట్లుగా గుర్తించారు. అత్యధికంగా వుహాన్ నగరంలోనే వైరస్ బాధితులున్నారు.

చైనా కాక 25 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. భారత్ లో కూడా మూడు కేసులు నమోదయ్యాయి. ఆ మూడు కూడా కేరళలో నమోదు కావడంతో కన్నడిగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వుహాన్ లో 16 మంది విదేశీయులకు ఈ వైరస్ సోకినట్లు సమాచారం. వారిలో పాకిస్థానీలు నలుగురు, ఇద్దరు ఆస్ర్టేలియా వాసులున్నట్లుగా తెలుస్తోంది. పాకిస్థానీలు తమ దేశానికి పంపించాలని వేడుకున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. పాక్ ప్రభుత్వంకూడా కరోనా ను అడ్డుకునేందుకు తమ వద్ద సరైన వసతులు లేవని తేల్చి చెప్పింది.

జపాన్లో డైమండ్ ప్రిన్సెస్ అనే నౌకలో ప్రయాణిస్తున్న 3711 మందిలో కనీసం 10 మందికైనా ఈ వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు కొందరు. ఈ నౌకలోనే ప్రయాణించి హాంకాంగ్ లో దిగిన ఒక వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా..కరోనా లక్షణాలుండటంతో ముందు జాగ్రత్తగా అందరికీ పరీక్షలు చేశారు. నౌకలో ఉన్నవారెవ్వరూ బయటికి రావొద్దని, తమతమ గదుల్లోనే ఉండాల్సిందిగా సూచించారు. సోమవారం జపాన్ లోని యొకహామా తీరానికి నౌక చేరినప్పటికీ..అందులో ఉన్న ప్రయాణికులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేంత వరకూ ఎవరూ బయటికి రావడానికి వీల్లేదని ఆంక్షలు విధించింది జపాన్ ప్రభుత్వం.

Next Story