వణికిస్తున్న వైరస్
By Newsmeter.Network
ఓ కొత్త వైరస్ ఇప్పుడు చైనాని వణికిస్తోంది. ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతోంది. ఈ వైరస్ కారణంగా ఇంతవరకు ఆ నగరంలో 41 మంది నిమోనియా బారిన పడగా, ఇద్దరు ఏకంగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా అని పిలవబడుతున్న ఈ వైరస్ చైనాలోని వుహాన్ నగరాన్ని భయపెడుతోంది.
ఈ వైరస్ జంతువుల నుంచి వ్యాపిస్తుందని ముందుగా అనుమానించారు. కానీ, ఆ తర్వాత మనుషుల నుంచే మనషులకు వస్తుందని తెలియడంతో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాలన్నింటిని అధికారులు అప్రమత్తం చేశారు. ఇటీవల చైనాను సందర్శించి వచ్చిన 15 మంది హాంకాంగ్ యువకులకు ఈ వైరస్ సోకిందో, లేదో తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం స్వైన్ ఫ్లూన్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను వణికించింది. తర్వాత జికా, ఇప్పుడు కరోనా వైరస్ టెన్షన్ పెడుతున్నాయి. దీంతో ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.
కేవలం చైనాలోనే కాకుండా మరో రెండు ఆసియా దేశాలు థారులాండ్, జపాన్‌లలో కూడా ప్రాణాంతక సార్స్ వ్యాధి కారక కుటుంబానికి చెందిన కరోనవైరస్ తన ప్రభావం చూపుతోందని భావిస్తున్నారు.
చైనా లోని వుహాన్ నగరంలో ఈ వైరస్ ఆధారిత నిమోనియాతో 41 మంది బాధపడుతున్నారు. వైరస్ సంక్రమించిన 12 మంది చికిత్సతో కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని వూహాన్ హెల్త్ కమిషన్ తెలిపింది.మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఇటీవల ఈ నగరాన్ని సందర్శించిన ఓ 30 ఏళ్ల జపాన్ యువకుడికి కూడా ఈ వైరస్ సోకింది. దీంతో వైరస్‌కు సంబంధించిన తొలి కేసు నమోదైనట్లు జపాన్ ధ్రువీకరించింది. దీంతో అమెరికా సైతం తమ పౌరులను అప్రమత్తం చేసింది. అమెరికాలోని వ్యాధి నియంత్రణ కేంద్రాలు ఒకటో స్ధాయి హెచ్చరికను జారీ చేశాయి. అయితే చైనా ప్రయాణీకులపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు.
ఈ వైరస్ ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి సంక్రమించే ప్రమాదం లేదు. కాని అవకాశాలను మాత్రం తోసిపుచ్చలేమని హెల్త్ కమిషన్ పేర్కొంది. చైనా వెలుపలి ప్రాంతాల నుండి కూడా ఈ వైరస్ సంక్రమిస్తున్నట్లు వూహాన్‌లో అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే చైనా వెళ్లే భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాక చైనా నుంచి తిరిగివస్తున్న వారినిసైతం కేంద్ర ఆరోగ్య శాఖ థర్మల్ స్కానర్లతో పరీక్షిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల విమానాశ్రయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఈ వైరస్ గురించి ఎక్కువగా తెలియకపోయినప్పటికీ కొన్ని జాగ్రత్తలను కేంద్రం సూచిస్తోంది. పొలాలకు, జంతుశాలలకు, జంతువధ స్థానాలకు వెళ్లవద్దని తెలిపింది. మాంసానికి దూరంగా ఉండాలని, ఒకవేళ తినాల్సి వస్తే బాగా ఉడికించిన మాంసాన్ని తీసుకోవాల్సిందిగా సూచించింది.