కరోనా వ్యాక్సిన్.. 108 మందిపై ట్రయల్స్..!
By సుభాష్ Published on 25 March 2020 11:45 AM ISTకరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పట్టిపీడిస్తోంది. ఈ మహమ్మారికి విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ వైరస్ వల్ల ఇప్పటికి 16 వేల మంది మంది వరకు మృతి చెందగా, 4 లక్షలకుపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక భారత్ లో కూడా ఈ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 500లకుపైగా చేరింది. మృతుల సంఖ్య 11కు చేరుకుంది. ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది.
ఇక ఈ కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ను కనుక్కునేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. చైనా, అమెరికా, యూరప్ దేశాలతో పాటు భారత్ కూడా వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆయా దేశాలకు చెందిన వందలాది మంది శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ కోసం నిరంతరం శ్రమిస్తున్నారు
ఇక చైనా ఇప్పటికే కరోనా విషయంలో క్లినికల్ ట్రయల్స్ వరకు వెళ్లింది. వ్యాక్సిన్ తయారీకి చైనా దేశానికి చెందిన 1000 మందికిపైగా శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ తయారీలో నైపుణ్యం కలిగిన మిలటరీ మెడికల్ సైన్సెస్ లో కరోనా విరుగుడుకు వ్యాక్సిన్ తయారు చేసినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ నెల 16న మొదటి ట్రయల్స్ జరిగిందని సమాచారం. ట్రయల్స్ లో భాగంగా 18-60 ఏళ్లు వయసు కలిగిన 108 మందిని మూడు బృందాలుగా విభజించి, రకరకాల డోసులను ఇచ్చారు. వీరంతా వూహాన్ నగరానికి చెందిన వారేనని తెలుస్తోంది. వీరిలో కొంతమందికి జ్వరం లక్షణాలు ఉన్నప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్న మాట. దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
అలాగే అమెరికా కూడా కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉంది. ఈ దేశానికి చెందిన పలు కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసేందుకు ముందుకొస్తున్నాయి.
ఇక భారత్ లో కూడా వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందుకు ఈ రంగంలో అనుభవం ఉన్న ముంబైకి చెందిన సిప్లా కంపెనీ రంగంలోకి దిగింది. త్వరలోనే ట్రయల్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
చైనా ఈ వ్యాక్సిన్ నిజంగానే తయారు చేసి కరోనా పాజిటివ్ వచ్చిన వారిపై ట్రయల్స్ నిర్వహించారా..? అనేది తెలియాల్సింటే మరి కొద్ది రోజులు ఆగాలి.