ప్రభుత్వానికి ఈ ఐడియా ఎందుకు రాలేదు?

By సుభాష్  Published on  9 July 2020 5:13 AM GMT
ప్రభుత్వానికి ఈ ఐడియా ఎందుకు రాలేదు?

గడిచిన వారం పది రోజుల్లో హైదరాబాద్ మహానగరంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరిగిపోయిన క్రమంలో కొందరికి అత్యవసర వైద్యసాయం అవసరమవుతోంది. తమకు దగ్గర్లోని ఆసుపత్రులకు వెళ్లటం వారేమో తమ వద్ద బెడ్లు ఖాళీగా లేవని చెబుతున్నారు. ఇలా ఒకటికి పది ఆసుపత్రులు తిరగాల్సి రావటం.. పుణ్యకాలం గడిపిపోవటంతో ఆసుపత్రిలో చేరే సమయానికే తుదిశ్వాస విడుస్తున్నారు. మరికొందరు ఏదో ఒక ఆసుపత్రిలోకి చేరిన కాసేపటికే మరణిస్తున్నారు. ఎందుకిలా అంటే.. గోల్డెన్ అవర్ లో రోగికి అందాల్సిన వైద్యం అందకపోవటమే.

పెద్దదిగా కనిపిస్తున్న ఈ సమస్య పరిష్కారం చాలా చిన్నది. అటు ప్రభుత్వం కానీ ప్రైవేటు ఆసుపత్రులు కానీ ఒకే మాటకు రాకపోవటం కూడా ఈ ఇబ్బందిని అధిగమించలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న బెడ్లు ఎన్ని అన్న విషయాన్ని ఆన్ లైన్ లో తెలిసేలా చేయగలిగితే సరిపోతుంది. ఇంత చిన్న ఆలోచన ఇప్పటివరకూ ఎందుకు అమలు చేయకపోవటం ఏమిటి? అన్నది ఒక ప్రశ్న.

ఇప్పుడు అనుసరిస్తున్న విధానాన్ని కాస్త మారిస్తే పోయే ప్రాణాల్ని కాపాడే అవకాశం ఉన్నప్పుడు.. ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరించటం లేదన్నది అర్థం కానిదిగా మారింది. పాజిటివ్ బారిన పడినోళ్లలో తీవ్రత ఉన్న వారు ఎక్కువ మంది ఉంటే.. రోగ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్న వారి సంఖ్య తక్కువ ఉంది. ఇలాంటివేళ.. తాము ఏ ఆసుపత్రికి తీసుకెళ్లాలి? ఎక్కడ బెడ్లు ఖాళీగా ఉన్నాయన్న విషయాన్ని తెలియజేసేలా ఒక వెబ్ సైట్ ను లేదంటే యాప్ ను రూపొందించటం కష్టమైన పని కాదు. ఆ చిన్న విషయాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎందుకు చేయలేకపోతోంది? అన్న సందేహానికి సమాధానం చెప్పేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి.

తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్ లో కరోనా రోగానికి వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రుల్లో లభ్యమవుతున్న బెడ్ల సంఖ్య ఏకంగా 11,365. మరిన్ని ఉన్నప్పటికీ రోగులు పలువురికి బెడ్లు లేవని ఎందుకు చెబుతున్నాయి? అన్నది ప్రశ్న. ఏ ఆసుపత్రిలో ఎన్ని బెడ్లు ఉన్నాయన్న విషయం ఆసుపత్రుల యాజమాన్యాలకు తప్పించి ఆరోగ్య శాఖ అధికారులకు కూడా తెలీని పరిస్థితి.

దీంతో.. వైద్యం కోసం వచ్చిన వారిని తిరస్కరించేందుకు ఆసుపత్రుల విచక్షణ మీద ఆధారపడి ఉంటోంది. దీని కారణంగా తమ అవసరాలకు అనుగుణంగా బెడ్లు లేవన్న మాటను చాలా సింఫుల్ గా చెప్పేస్తున్నారు. దీని కారణంగా పలువురు సరైన సమయంలో వైద్యం అందక మరణిస్తున్న పరిస్థితి అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. అందుకే.. ప్రభుత్వ.. ప్రైవేటుఆసుపత్రుల్లో లభ్యమయ్యే బెడ్ల సంఖ్య ఎంతన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా యాప్ ను రూపొందిస్తే చాలా మరణాల్ని అడ్డుకునే అవకాశం ఉందంటున్నారు. మరీ విషయంలో మంత్రి ఈటెల వారు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

Next Story