దారుణం: కరోనా సోకిందని తల్లిని పొలం వద్ద వదిలేసిన కొడుకులు

By సుభాష్  Published on  6 Sep 2020 10:24 AM GMT
దారుణం: కరోనా సోకిందని తల్లిని పొలం వద్ద వదిలేసిన కొడుకులు

కరోనా మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ.. ఇన్నీ కావు. ఈ మహమ్మారి రోజురోజుకు పెరుగుతుంది తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా మానవ సంబంధాలపై దెబ్బ తీస్తోంది. మనుషుల్లో మానవత్వం లేదని ప్రపంచానికి తెలియజేస్తోంది. కరోనా కారణంగా షాక్‌కు గురి చేసే సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా మరో ఘటన చోటు చేసుకోవడం మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఉంది.

నవమాసాలు మోసి, కని పెంచిన తల్లికి కరోనా ఉందని కొడుకులే వివక్ష చూపించారు. ఈ దారుణ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మారబోయిన లచ్చమ్మ (85)కు కరోనా సోకింది. దీంతో కన్నకొడుకులే తల్లిని ఒంటరిగా పొలంలో వదిలేశారు. బాధితురాలికి నలుగురు కుమారులు. ఒక కుమార్తె ఉన్నా.. ఎవ్వరు కూడా చేరదీయక ఇలా పొలంలో వదిలేయడం సమాజం తలదించుకునేలా ఉంది. చివరికి అధికారులకు, పోలీసులకు విషయం తెలియడంతో వారు వచ్చి లచ్చమ్మను ఇంటికి చేర్చారు. ఇంకోసారి ఇలా పొలం వద్ద వదిలేసినట్లయితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు ఆమె కొడుకులను హెచ్చరించారు.

ఇదొక్కటే కాదు.. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ప్రపంచ దేశాలకు చాపకింద నీరులా విస్తరించిన కరోనా మహమ్మారి.. ఎన్నో కుటుంబాలపై చిచ్చు పెడుతోంది. కరోనా సోకిందంటే చాలు అందరు ఏదో నేరస్తుడిలా చూస్తున్నారు. కరోనా సోకి ఎవరైనా మృతి చెందినట్లయితే కడసారి చూపు కూడా నోచుకోలేకపోతున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితిని తెస్తుంది కరోనా. కరోనా సోకిన వారిని దూరం కొట్ట కట్టవద్దని, సమాజంలోని ఒక మనిషిలా చూడాలి తప్ప.. ఏదో తప్పు చేసినోడిలా చూడవద్దని అధికారులు సూచిస్తున్నా.. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.

Next Story