కరోనా టిప్స్‌ పాటించండి

By సుభాష్  Published on  23 Aug 2020 1:37 PM IST
కరోనా టిప్స్‌ పాటించండి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. భౌతిక దూరం, మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. అలాగే వైరస్‌ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. నిపుణులు ఎలాంటి సూచనలు చేస్తున్నారంటే..

► ఇంట్లో సరైన వెంటిలేషన్‌ లేకపోతే గాలి వచ్చే అవకాశం ఉండదు. అలాగే భౌతిక దూరం పాటించడం కుదరకపోవచ్చు. అందుకే బయటకన్నా ఇంట్లో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. వీలైనంతగా ఇంట్లో కాకుండా ఇంటి ఆవరణలో ఉండేందుకు ప్రయత్నించాలి.

► ఉదయాన్నే సూర్యరశ్మిలో నిలబడితే 'డి' విటమిన్‌ వస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఉంచడంలో 'డి' విటమిన్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. సూర్యకిరణాలు కరోనా వైరస్‌ను అరికడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

► కరోనా కేసులు మొదలైన నాటి నుంచి చెబుతున్న విషయమే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయటకు వెళ్లిన ప్రతిసారి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. అలాగే భౌతిక దూరం కూడా తప్పనిసరిగా పాటించాలి.

► నోటి తుంపర్ల ద్వారా బయటకు వచ్చే కరోనా వైరస్‌ గాలిలో కొంత సమయం ఉంటుంది. ఆ గాలిని ఎవరైనా పీల్చుకుంటే వారు కరోనా బారినపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏసీ ద్వారా వచ్చే గాలి వేగంగా కదులుతుంది. దీంతో వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంత వరకు ఏసీలను ఉపయోగించుకోకుంటే మంచిది.

► కారులో ప్రయాణించే సమయంలో విండోలు తెరిచే ఉంచాలి. కారు విండోలు మూసి ఉంచితే గాలి సరఫరా ఉండదు. ఏసీతో మరింత ప్రమాదం ఉంది.

► కరోనా వైరస్‌ నోరు, కళ్లు, ముక్కు ద్వారానే శరీరంలోకి వెళ్తుంది. కాబట్టి చేతులను శుభ్రంగా కడుక్కోకుండానే వాటిని తాకే ప్రయత్నం చేయరాదు.

► కోవిడ్‌ కారణంగా ప్రపంచమంతటా విమాన సర్వీసులన్నీ మూసివేశాయి. ప్రస్తుతం విమాన ప్రయాణాలకు అవకాశం కల్పించారు. ప్రయాణాల్లో ఎవరైనా తుమ్మినా, దగ్గినా అనుమానించాల్సి ఉంటుంది. అందుకే విమాన ప్రయాణాలు నిలిపివేసుకుంటే మరి మంచిది.

► ఒకప్పుడు చేతులు సరిగ్గా కడుక్కోకపోయినా పెద్దగా పట్టించుకునేవాళ్లం కాదు. ఇప్పుడు మాత్రం శానిటైజర్‌ లేదా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే వైరస్‌ సోకే ప్రమాదం ఉంది.

► ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్తున్నారు. లంచ్‌టైమ్‌లో అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఆహారం ఇతరులతో పంచుకోకుండా ఉండడమే ఉత్తమం. చాలా మందితో కరోనా పాజిటివ్‌ ఉన్నా లక్షణాలు మాత్రం ఏమి ఉండటం లేదు. అలాంటి సమయంలో ఆహారం పంచుకునే సమయంలో కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

► ఒకరికొకరు వైరస్‌ సోకకుండా ఉండాలంటే కనీసం ఆరు అడుగుల దూరం పాటించడం తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి నిపుణుల వరకు చెబుతూనే ఉన్నారు. ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా కరోనాను కట్టడి చేయాలంటే ఇంతకంటే మార్గం మరొక్కటి లేదు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే వరకు భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం తప్పనిసరి.

► ఏదైనా షాపింగ్‌ మాల్స్‌లో, ఇంతర ప్రదేశాలకు వెళ్లిన సమయంలో ఎక్కడ తాకకుండా ఉంటే మంచిది. అలాగే లిప్ట్‌లో వెళ్లకుండా మెట్ల మార్గం ద్వారా వెళ్తే మంచిది. సాధ్యమైనంత వరకు ఎక్కువగా షాపింగ్‌లు, బయటకు వెళ్లడం చేయకుంటే మేల. అత్యవసరం అయితే తప్ప.

Next Story