ట్రంప్‌కు కరోనా పరీక్ష.. ఫలితాలు వెల్లడించిన శ్వేతసౌధం!
By Newsmeter.Network
కరోనా వైరస్ ఎవ్వరిని వదలడం లేదు. అగ్రరాజ్యం అమెరికాలోనూ కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. కరోనా ప్రభావంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే ఆ దేశంలో మృతుల సంఖ్య 50కి చేరింది. పలువురు కరోనా వైరస్ ప్రభావంతో ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించారు. ఎమర్జెన్సీ కింద దాదాపు 50బిలియన్ డాలర్ల మేర నిధులు అందుబాటులోకి వస్తాయి. అంతేకాక ప్రతీ రాష్ట్రంలో అత్యవసరంగా వైద్య కేంద్రాలు, ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయనున్నారు.
Also Read :!కరోనాపై దుష్ప్రచారం చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..!
ఇదిలా ఉంటే ట్రంప్ శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో మీరెందుకు కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోలేదని ప్రశ్నించారు. దీంతో తానకు కరోనా లక్షణాలు లేవని అందుకే పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని ట్రంప్ తెలిపారు. ట్రంప్ ఇటీవల బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో సహా ఆయన కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియోతో భేటీ అయ్యారు.
తాజాగా ఫాబియోకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ట్రంప్‌కు వైరస్ సోకిందా అనే సందేశాలు వ్యక్తమయ్యాయి. వైరస్ సోకిన వ్యక్తులను ఎవరైనా కలిస్తే వారు ఇతరులను ఎవరిని కలవకుండా 14రోజుల పాటు స్వీయ గృహనిర్భందంలో గడపాలని అమెరికా అధికారంగా సలహా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య పరీక్షల్లో నెగిటివ్ అని రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 24గంటల్లోపే ఫలితాలు రావడం విశేషం.