ఇదీ తాజా కరోనా స్కోర్ కార్డు
By రాణి Published on 28 Feb 2020 12:22 PM IST
కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించేస్తోంది. ఏరోజుకారోజు కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఎప్పటికప్పుడు స్కోర్ కార్డులో అంకెలు పైపైకి దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకూ 82,549 కేసులు నమోదయ్యాయి. 2,810 మంది చనిపోయారు. 33,252 మంది రోగం నుంచి రికవర్ అయ్యారు.
కరోనా విషయంలో ప్రధాన పరిణామాలు ఇవి :
సౌదీ అరేబియా :
సౌదీ అరేబియాలో ఇప్పటి వరకూ కరోనా లేదా కోవిడ్ 19 కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. కానీ ముందు జాగ్రత్తగా ముస్లింలకు పవిత్ర క్షేత్రాలైన మక్కా మదీనాలకు నిర్వహించే ఉమ్రా తీర్థయాత్ర ను కూడా నిషేధించింది. ముఖ్యంగా కరోనా బారిన పడ్డ దేశాల నుంచి ప్రయానీకులను రాకుండా నిషేధించింది. ఈ దేశాల నుంచి వచ్చే వారి వీసాలను రద్దు చేసింది.
ఇరాన్ :
ఇరాన్ లో ఇప్పటి వరకూ 256 కరోనా కేసులు నమోదయ్యాయి. 26 మరణాలు నమోదయ్యాయి. తెహరాన్ నగరంలో శుక్రవారం చేసే సామూహిక ప్రార్థనలను కూడా రద్దు చేశారు. పలు ప్రధాన నగరాల్లోనూ ఇదే తరహా చర్యలు చేపట్టారు.
ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై భారం - కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థలు కుదేలయ్యాయి. దాదాపు 250 బిలియన్ల డాలర్ల మేరకు నష్టం జరిగింది. డౌ స్టాక్స్ 2.2 శాతం పడిపోయాయి.
ఇండియా :
మన దేశం చైనానుంచి వచ్చిన ప్రతివారిని వేరుపరచి, క్వారంటైన్ చేయాలని నిర్ణయించింది. చైనా నుంచి మన దేశానికి రాకుండా ప్రస్తుతం అక్కడి ప్రజలకున్న వీసాలను రద్దు చేసింది. చైనాలోని భారతీయ రాయబార కార్యాలయం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. Beijing@mea.gov.in అనే ఈ మెయిల్ కి వ్రాసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇరాన్, సింగపూర్, ఇటలీ, కొరియా వంటి దేశాలకు అవసరం లేకుండా వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈ దేశాల నుంచి ఇటీవలే వచ్చిన వారిని క్వారంటైన్ చేయడం జరుగుతోంది. మరో వైపు జపాన్ తీరంలో లంగరు వేసిన డైమండ్ ప్రిన్సెస్ పడవ లోని 119 మంది భారతీయులను మన దేశానికి తేవడం జరిగింది. వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ చేయడం జరుగుతోంది.