కరోనా వేళలో ఆఫీసుకు వెళుతున్నారా? అయితే.. ఇది మీ కోసమే
By సుభాష్ Published on 23 July 2020 6:03 AM GMTదేశంలో పాజిటివ్ కేసులు అంతంతకూ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే. ఉద్యోగంలో భాగంగా ఆఫీసులకు వెళ్లటం చాలామందికి తప్పనిసరైంది. ఐటీ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ.. మిగిలిన రంగాల్లో పని చేసే వారికి ఆఫీసులకు వెళ్లాల్సిందే. కేసుల తీవ్రత పెరుగుతున్న వేళ.. మరెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పని చేసే చోట.. కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారా? అన్నది ప్రశ్న.
కరోనా వచ్చిన తర్వాత వేదన చెందే కన్నా.. రాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరి. అందులో భాగంగా కొన్నింటిని తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు.ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమంటే..
► సాధ్యమైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలి
► మాస్కులు తప్పనిసరి. ఫేస్ మాస్కులైనా ఫర్లేదు
► సబ్బు లేదంటే హ్యాండ్ వాష్ తో కనీసం 40-60 సెకన్ల పాటు తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ ను కనీసం 20 సెకన్లు శుభ్రం చేసుకోవాలి.
► దగ్గు, తమ్ములు వచ్చినపుడు మోచేతలను అడ్డుపెట్టుకోవడం అలవాటుగా మారాలి. లేదంటే కర్చీఫ్, టిష్యూ పేపర్ ఉపయోగించటం మర్చిపోకూడదు. టిష్యూ పేపర్ ను పారవేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి.
► ఉద్యోగులంతా వారి ఆరోగ్యపరిస్థితులను ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలి. ఎవరిలోనైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి
► ఆఫీసు పరిసరాల్లో.. డస్ట్ బిన్లలో.. వాష్ రూమ్ లలో ఉమ్మివేయడం నిషేధించారన్నది మర్చిపోకూడదు.
► ఉద్యోగులు అందరూ ఆరోగ్యసేతు యాప్ వాడేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
ఆఫీసులో అనుసరించాల్సిన ప్రమాణాలు
► ఆఫీసు ప్రవేశమార్గంలో తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకొనేందుకు శానిటైజర్ తోపాటు థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి
► సాధారణ టెంపరేచర్, ఎలాంటి లక్షణాలు కనిపించని వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి.
► ఒకవేళ కంటెయిన్‌మెంట్ జోన్లలో ఎవరైనా ఉన్నట్టయితే వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి.
► అలాంటి వారు ఎవరూ ఆఫీసుకు రాకూడదు. వారిని ఇంటి నుంచే పనిచేయించాలి. దాన్ని సెలవుగా లెక్కలోకి తీసుకోకూడదు.
► అధికారుల వాహనాలు నడిపే డ్రైవర్లు సైతం భౌతికదూరం పాటించాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంపై వారికి అవగాహన కల్పించాలి.
► ఒకవేళ డ్రైవర్లు కంటెయిన్‌మెంట్ జోన్లలో ఉంటుంటే వారిని విధులకు దూరంగా ఉండాలని కోరాలి.
► ప్రతిరోజు వాహనాలను 1% సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి. స్టీరింగ్, డోర్లు, హ్యాండిల్స్, తాళాలు కూడా డిస్‌ఇన్‌ఫెక్ట్ చేయాలి.
► ఉద్యోగుల్లో వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్య సమస్యలున్నవారు ఉంటే వారిని మిగిలిన వారితో కలిసి ఉంచకూడదు. ఇలాంటి వారిని ఇంటి నుంచే పని చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
► మాస్కులు ధరించిన వారిని మాత్రమే ఆఫీసుల్లోకి అనుమతించాలి. ఆఫీసు పరిసరాల్లో ఉన్న సమయాల్లో మాస్కు ధరించటం తప్పనిసరి చేయాలి.
► రోజువారీగా వచ్చే సందర్శకులను నియంత్రించాలి. తాత్కాలికంగా విజిటర్స్ ను నిలిపివేయాలి.
► ఉన్నతాధికారుల్ని కలిసేందుకు వచ్చే వారిని పూర్తిగా పరీక్షించిన తర్వాతే అనుమతించాలి.
► సమావేశాల్ని వీలైనంత వరకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారానే కొనసాగించాలి.
► కోవిడ్-19 గురించి.. నివారణ చర్యలకు సంబంధించిన పోస్టర్లు ఏర్పాటు చేయాలి. అవగాహన కల్పిస్తుండాలి.
► ఆఫీసు పనివేళలు, మధ్యాహ్న భోజనం, టీ విరామ సమయాల్ని దశలవారీగా అమలుచేయాలి.
► పార్కింగ్, బయటి ప్రదేశాల్లో గుంపులుగా ఉండకూడదు. భౌతిక దూరం పాటించటం తప్పనిసరి.
► వ్యాలెట్ పార్కింగ్ ఉన్నట్లయితే.. వాహనాలను తీసుకెళ్లే సిబ్బంది తప్పనిసరిగా మాస్కు, గ్లౌజ్‌లు, ఫేస్ షీల్డ్‌ను ధరించాలి. కారు తాళం చెవులు, స్టీరింగ్, గేర్‌పై డిస్‌ఇన్ఫెక్షన్ స్ర్పే చేయాలి.
► వాష్ రూమ్స్ లో హ్యాండ్ శానిటైజర్లు, సబ్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి.
► ఉద్యోగులు పని చేసే చోట భౌతిక దూరం పాటించేలా సీటింగ్ విధానం ఉండాలి.
► ఆఫీసులోకి వెళ్లేందుకు అధికారులు, స్టాఫ్, విజిటర్లకు ప్రత్యేకంగా ఎంట్రీ ఉండాలి.
► లిఫ్టులలో భౌతిక దూరం పాటించేలా వ్యక్తుల సంఖ్యను తగ్గించాలి.
► ఏసీల్ని 24-30 డిగ్రీల సెల్సియస్ మధ్య, గాలిలో తేమ 40-70శాతం మధ్య ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆఫీసులో కోవిడ్ కేసులు నమోదైతే?
ఆఫీసుల్లో కోవిడ్ కేసులు నమోదైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది చాలా కీలకం. ఇలాంటి సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే?
► ఆఫీసుల్లో ఎవరైనా అనుమానిత లక్షణాలతో కనిపిస్తే వారు కలిసి పని చేసే వ్యక్తుల నుంచి వేరు చేసి వెంటనే ప్రత్యేక ప్రదేశంలో ఉంచాలి.
► స్థానికంగా ఉండే వైద్య సిబ్బంది లేదంటే జిల్లా.. రాష్ట్రస్థాయి హెల్ప్ లైన్లకు కాల్ చేయాలి.
► ఒకట్రెండు పాజిటివ్ కేసులు బయటపడితే డిస్ ఇన్ ఫెక్ట్ చేసే విధానం తక్కువగా ఉంటుంది. సదరు బాధితుడు గడిచిన 48 గంటల్లో తిరిగిన ప్రదేశాల్ని శుభ్రం చేస్తే సరిపోతుంది. మొత్తం ఆఫీసును మూసేయాల్సిన అవసరం ఉండదు.
► ఆఫీసులో ఎక్కువ కేసులు నమోదైతే సదరు భవనాన్ని లేదంటే బ్లాక్ ను 48 గంటలు మూసేసి.. పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలి. ఆ పని అయ్యే వరకూ సిబ్బంది ఇంటి నుంచే పని చేయాలి. ఒకవేళ పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ అయిన వారు రెండు రోజుల్లో కోవిడ్ లక్షణాలు కనిపిస్తే కనీసం పద్నాలుగు రోజులు క్వారంటైన్ కు వెళ్లటం తప్పనిసరి.