పులికి కూడా సోకిన కరోనా వైరస్.. ఇప్పుడేమవుతుందో..!

By అంజి  Published on  6 April 2020 5:52 AM GMT
పులికి కూడా సోకిన కరోనా వైరస్.. ఇప్పుడేమవుతుందో..!

కరోనా వైరస్.. ఇప్పటికే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లో ఉన్న సమయంలో ఓ జంతువుకు కూడా కోవిద్-19 పాజిటివ్ రావడంతో అందరూ షాక్ కు గురయ్యారు.

అమెరికా లోని బ్రాంక్స్ జూ లో ఉన్న పులికి కరోనా వైరస్ సోకిందని నిర్ధారించారు. అమెరికాలో కరోనా వైరస్ సోకిన మొదటి జీవి ఇదే కాగా.. ఒక పులికి కరోనా వైరస్ సోకడం.. ఈ భూమిపై ఇదే ప్రప్రథమం అని ఫెడరల్ అధికారులు స్పష్టం చేశారు.

మలయన్ జాతి పులి అయిన నాలుగు సంవత్సరాల నదియా, అలాగే ఆరు పులులు, సింహాలు అనారోగ్యానికి గురయ్యాయి. జూలో పని చేసే ఉద్యోగి కారణంగా వాటికి కరోనా వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిలో మాత్రం కరోనా వైరస్ లక్షణాలు లేవు. మార్చి 27 వ తేదీన నదియాలో కోవిద్-19 లక్షణాలు కనిపించాయని.. కానీ క్రమక్రమంగా అది కోలుకుంటోందని జూ అధికారులు తెలిపారు. న్యూయార్క్ నగరంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరగడంతో మార్చి 16న ఆ జూను మూసివేశారు.

"ఇవి తమ జీవితంలో చాలా చెడ్డ రోజులు.. మేము ఎక్కడ పనిచేస్తున్నామో, ఎక్కడ బ్రతుకుతున్నామో అన్నది అనవసరం.. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఘటనల ద్వారా వైరస్ లక్షణాలను అంచనా వేస్తాం.. ఖచ్చితంగా ఈ మహమ్మారితో పోరాడతాం" అని జూ డైరెక్టర్ జిమ్ బ్రెహెనీ తన స్టేట్మెంట్ ను విడుదల చేశాడు.

పులికి వైరస్ సోకిందని తెలియగానే సరికొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. జంతువులకు కూడా ఈ వైరస్ సోకుతోందా అని భయపడే వారు కూడా ఉన్నారు. అమెరికాలో ఇప్పటి వరకూ పెంపుడు జంతువులకు కానీ, పశువులకు కానీ వైరస్ సోకినట్లు రికార్డులకు ఎక్కలేదని అంటున్నారు. వెటర్నేరియన్ జేన్ రూనీ మాట్లాడుతూ జంతువులకు వైరస్ సోకుతుందని ఇప్పటి వరకూ ఎటువంటి సాక్ష్యాలు తమ దగ్గర లేవని.. జంతువుల నుండి వైరస్ మనుషులకు సోకుతుందన్నదానికి ప్రూఫ్ లు లేవని తేల్చారు.

USDA ఆదివారం నాడు మాట్లాడుతూ జంతువులకు రొటీన్ కరోనా వైరస్ పరీక్షలు చేస్తే సరిపోదని తెలిపింది. రూనీ మాట్లాడుతూ జూలలో ఉన్న చాలా జంతువులకు సంబంధించిన శాంపుల్స్ ను నేషనల్ వెటర్నరీ సర్వీస్ లాబొరేటరీస్ లో పరీక్షించామని.. మిగిలిన జంతువులకు నెగటివ్ రాగా ఒక్క నదియాకు మాత్రమే పాజిటివ్ వచ్చిందని అన్నారు.

జంతువులను కూడా వదలని కరోనా..

కరోనా వైరస్ ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మాత్రమే సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ అమెరికా వెలుపల కొన్ని కుక్కలకు, పిల్లులకు కరోనా వైరస్ సోకిందనే వార్తలు వస్తున్నాయి. కరోనా వైరస్ బాధితులకు దగ్గరగా ఉన్న పెంపుడు జంతువుల్లో కోవిద్-19 లక్షణాలు ఉండే అవకాశం ఉందని మరి కొందరు అభిప్రాయ పడుతున్నారు. హాంగ్ కాంగ్ లో ఓ కుక్కకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. హాంగ్ కాంగ్ కు చెందిన అధికారులు మాట్లాడుతూ పెంపుడు జంతువుల కారణంగా ఈ వైరస్ సోకదని.. ఒకవేళ ఆ పెంపుడు జంతువు యజమానిలో కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించడం చాలా ముఖ్యమని చెప్పారు. కరోనా లక్షణాలు మనుషుల్లో రాగానే తమ పెంపుడు జంతువులకు కాస్త దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు అధికారులు. జంతువులను తాకడానికి ముందు, తాకిన తర్వాత చేతులను జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలని అంటున్నారు. ఇంటిని, పెంపుడు జంతువులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు జారీ చేస్తున్నారు.

బ్రాంక్స్ జూలోని నదియా, నదియా చెల్లెలు అజుల్, రెండు అముర్ పులులు, మూడు ఆఫ్రికన్ సింహాలలో పొడి దగ్గు రావడం గమనించారు.. అలాగే మరికొన్ని లక్షణాలు ఉండడం జూ ఛీఫ్ వెటర్నేరియన్ డాక్టర్ పాల్ కాలే గమనించారు. దీంతో జూ అధికారులు వాటికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నదియాకు మాత్రమే పాజిటివ్ అని వచ్చింది. కరోనా లక్షణాలు కనిపిస్తున్న జంతువులన్నిటికీ జూలో పని చేసే ఓ వ్యక్తి కారణంగా వైరస్ సోకిందని అనుమానిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి మాత్రం ప్రస్తుతం బాగానే ఉన్నాడు. నదియా కూడా కోలుకుంటోందని జూ అధికారులు తెలిపారు. ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా జూ సిబ్బంది తగినన్ని జాగ్రత్తలు తీసుకోనుంది.

2017 లో అనిమల్ ప్లానెట్ టీవీ ఛానల్ లో ప్రసారమయిన 'ది జూ' సిరీస్ లో నదియా కనిపించింది.

Next Story