కరోనా ఎఫెక్ట్: జగన్ వార్నింగ్.. నిర్మానుషంగా మారిన రోడ్లు
By సుభాష్ Published on 22 March 2020 7:02 AM ISTచైనాలో పుట్టిన కరోనా వైరస్ ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. ప్రపంచ దేశాలను సైతం భయాందోళనకు గురి చేస్తోంది. తాజాగా కరోనా కారణంగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వచ్చంధంగా బంద్ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో అన్ని రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి ప్రభుత్వాలు. జనతా కర్ఫ్యూకు చేయిచేయి కలిపారు. ఇక ఏపీలో ఈ జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని జగన్ సర్కార్ ప్రజలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్‌లు, షాపింగ్ మాల్స్, ఇతర సంస్థలు మూతపడ్డాయి. ఇక ప్రజలంతా కూడా జనతా కర్ఫ్యూకు పూర్తిగా మద్దతు పలుకుతున్నారు.
ఇక విజయవాడతో పాటు మిగిలిన ప్రాంతాలు, పట్టణాల్లో కూడా ఉదయం 6 గంటల నుంచే జనతా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. శనివారం నుంచి ప్రజలు కర్ఫ్యూకు మద్దతు పలికేందుకు జనాలు సిద్ధమయ్యారు. ఇక అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దని జగన్ సర్కార్ పిలుపువ్వడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.
ఇక కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు స్టేషన్‌లలో అందుబాటులో ఉండాలని డీజీపీ సవాంగ్‌కు సూచించారు జగన్. ముందు జాగ్రత్తగా అంబులెన్స్లు , 108 వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ధరలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు.ఒక వేళ నిత్యావసర వస్తులు గానీ, మాస్కులు గానీ, ఇతర వస్తువులు గానీ వ్యాపారస్తులు ఎక్కడైన అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా పేరుతో అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు జగన్.
ఇప్పటికే కొందరు మాస్కులు అధిక ధరలకు విక్రయిస్తున్న సమాచారం అందిందని, అధిక ధరలకు విక్రయించిన వ్యాపారస్తులను గుర్తిస్తున్నామని, వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు చెప్పారు. అలాగే జనతా కర్ఫ్యూ విషయంలో ఎవరైన నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దొంగచాటున వ్యాపారస్తులు షాపులు తెరిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. అందుకు అధికారుల నిఘా ఉంటుందని పేర్కొన్నారు.
ఇక అత్యవసరాలకు మాత్రం బంద్ నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఇక కర్ఫ్యూ సందర్భంగా బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి.