కరోనా దెబ్బతో కోళ్ల పరిశ్రమ కుదేలు
By రాణి Published on 6 March 2020 11:17 AM ISTఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నది పాత సామెత. కరోనా వైరస్ కోళ్ల పరిశ్రమ చావుకొచ్చిందన్నది కొత్త సామెత. అవునండీ. కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రబలిన తరువాత మాంసాహారాన్ని తినేవారి సంఖ్య హఠాత్తుగా పడిపోయింది. చికెన్, మటన్, ఎగ్స్ అంటే నాలుకలు కోసుకునేవారంతా ఆహార పాతివ్రత్యాన్ని పాటిస్తున్నారు. భోజన బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తున్నారు. నో నాన్ వెజ్ అని స్పష్టంగా తేల్చి మరీ చెప్పేస్తున్నారు. దీంతో ఎగుమతులపై, లోకల్ మార్కెట్ పై ఆధారపడ్డ మన కోళ్ల ఫారంలు, బ్రాయిలర్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి.
కోళ్ల పరిశ్రమ చెబుతున్న దాని ప్రకారం ప్రజలు నాన్ వెజ్ తినడాన్ని బాగా తగ్గించారు. దీంతో చికెన్ ధర, గుడ్ల ధర సగానికి తగ్గింది. దీని వల్ల కరోనా వ్యాప్తి మొదలైన గత ఒక్క నెలలోనే దాదాపు రూ.400 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు వంద కోట్ల రూపాయల మేరకు నష్టం వచ్చిందని పౌల్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు. చేపల ధరలూ బాగా తగ్గుతున్నాయి. చేపల ధరలో పది నుంచి 40 శాతం వరకూ తగ్గుదల కనిపించిందని అధికారులు చెబుతున్నారు. కోడి గుడ్ల ఫార్మ్ గేట్ ధరలు కూడా నాలుగున్నర రూపాయల నుంచి మూడు రూపాయలకు పడిపోయాయి.
https://telugu.newsmeter.in/ap-government-health-bulletin-on-corona-virus/
ఇటీవలే చికెన్ తింటే కరోనా రాదని నిరూపించి చూపించేందుకు మంత్రులు కేటీఆర్, ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్, సినీ నటి రష్మిక మందన్నలు స్వయంగా బహిరంగంగా చికెన్ పీసులు తిని మరీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ దీని వల్ల పత్రికలకు చక్కని ఫోటోలొచ్చాయే తప్ప చికెన్, ఎగ్ సేల్స్ పెరగలేదు. నిజానికి చికెన్ తింటే కరోనా వస్తుందన్న సోషల్ మీడియా వార్తలన్నీ ఫేక్ న్యూసే నని, కానీ దీని వల్ల తమ వ్యాపారం పూర్తిగా కుదేలైపోయిందని నిపుణులు చెబుతున్నారు కొసమెరుపేమింటంటే ఇంత సంక్షోభంలోనూ చికెన్, ఎగ్స్ కి సంబంధించిన రీటెయిల్ ధరల్లో మాత్రం ఏమాత్రమూ తగ్గుదల లేదు.