ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీట వేసి పెళ్లి చేసుకుందామనుకుంటున్నారా? కరోనా రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి సర్… పెళ్లిని సింపుల్ గా కానిచ్చేయండి. పప్పన్నం, లడ్డూలు పెట్టేసి మెప్పులు పొందాలని, గొప్పలు పోవాలని అనుకోకండి. ఏదో తంతు అయిందనిపించండి. ఇదీ కరోనా విషయంలో వైద్యులు చెబుతున్న జాగ్రత్త.

పాపం ఈ సమ్మర్ లో సందడి చేయాలనుకున్న పెళ్లిళ్లన్నిటికీ ఇప్పుడు కరోనా సమస్య వచ్చిపడింది. అతిథులు లేకుండా, ఆర్భాటం లేకుండా ఏదో కానిచ్చేయడానికి మనసు రావాలి కదా..!! కానీ మీ మా బోంట్ల వారే కాదు సినీ ప్రముఖుల కళ్యాణాలకు కూడా కరోనా అడ్డొచ్చేస్తోంది. పాపం… యువ హీరోలు నిఖిల్, నితిన్ లు ఈ సమ్మర్ లో సందడిసందడిగా పెళ్లి సంరంభాన్ని చేసుకుందామనుకున్నారు. తమ ప్రియతములతో మూడుముళ్ల బంధాన్ని వేసుకుని ఏడడుగులు నడుద్దామనుకున్నారు. నితిన్ అయితే దుబాయిలో డిస్టినేషన్ వెడ్డింగ్ కి అన్ని సన్నాహాలు చేసుకున్నాడు. నిఖిల్ కూడా హంగులు, ఆర్భాటాలతో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు కరోనా ఆ ఉత్సాహం పై నీళ్లు చల్లింది. వీరిద్దరి పెళ్లిళ్లూ మార్చి 31 తరువాతే అయినా అతిథుల సంఖ్య రెండు వందలకు మించకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నితిన్ అయితే తన వివాహ స్థలాన్ని దుబాయి నుంచి వేరే చోటకు మార్చే విషయంలోనూ ఆలోచిస్తున్నాడట.

నిఖిల్ మాత్రం మా జంట పెళ్లిని ఏ శక్తీ ఆపలేదు. అవసరమైతే ఏదో ఒక గుడిలో ఇద్దరమూ పెళ్లి చేసేసుకుంటాం అని నిఖిల్ ప్రకటించాడు. నిఖిల్ పెళ్లి ముహూర్తం ఏప్రిల్ 16 కి ఫిక్సయింది. నిఖిల్ పెళ్లి కార్డులు పంచేందుకు సిద్ధమౌతుండగానే కరోనా విజృంభించింది. దీనితో ఆయన కార్డుల పంపిణీ వాయిదా వేసుకున్నారు. నితిన్ విషయంలో మామూలుగానే పరిమితంగా అతిథులను పిలవాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అసలు దుబాయిలో పెళ్లాడాలా మరో చోటకి వెళ్లాలా అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది.

అయితే కక్కొచ్చినా కళ్యాణమొచ్చినా ఆగదంటారు. కళ్యాణ ముహూర్తం వచ్చే సరికి కరోనా కూడా ఏమీ చేయలేదు. కరోనా ఉన్నా కళ్యాణం జరిగి తీరుతుంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.