కరోనా నుంచి కోలుకున్న వారిలో కొత్త సమస్య.. వైద్యుల హెచ్చరిక
By సుభాష్ Published on 1 Aug 2020 11:26 AM GMTకరోనా తెస్తున్న తంటాలు అన్నీ..ఇన్నీ కావు. కరోనా బారిన పడిన వారిలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నవారిలో కొత్తగా అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. కరోనా మహమ్మారి బారి నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారిలో కొత్తగా వినికిడి లోపం కనిపిస్తుందట. కరోనా నుంచి కోలుకున్నవారిలో చాలా మందికి వినికిడి కోల్పోయినట్లు గుర్తించారు.
అంతేకాదు వాసన, రుచిని కోల్పోవడం వంటి సమస్యలు అధికం అవుతున్నాయని అంటున్నారు. మాంచెస్టర్ యూనివర్సిటీ నిపుణులు వైరస్ నుంచి కోలుకున్నవారిలో వినికిడి లోపం ఉన్నట్లు గుర్తించామని నివేదించారు.
అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత పది మందిలో ఒకరు తమ రుచి, వాసన శాశ్వతంగా కోల్పోతారని ఇటాలియన్ రోగుల పరిశోధన వెల్లడించిన కొద్ది రోజుల్లోనే ఈ కొత్త సమస్య వెలుగులోకి వచ్చింది.
వైరస్ ప్రభావంతో ప్రజలు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవచ్చని పరిశోధకులు హెచ్చరించారు. 'లాంగ్ కోవిడ్'గా పిలిచే స్థితిలో పేషెంట్లు నెలల తరబడి దుష్పభావాలతో బాధపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మాంచెటస్టర్ యూనివర్సిటీలోని ఆడియాలిస్టుల తెలిపిన వివరాల ప్రకారం.. వైరస్ నుంచి కోలుకునేవారికి కూడా వినికిడి సమస్యలు తలెత్తవచ్చని అన్నారు.
ఎన్‌ఐహెచ్‌ఆర్ మాంచెస్టర్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ సహకారంతో ఈ అధ్యయనం వైథెన్‌షావ్ ఆస్పత్రిలో చేరిన 121 మందిపై సర్వే చేసింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రెండు నెలల తర్వాత వారిని ఫోన్ ద్వారా పలు అంశాలపై ప్రశ్నించారు. మీలో ఎవరికైనా ఏమైనా మార్పులు, సమస్యలు ఎదురవుతున్నాయా..? అని అడిగినప్పుడు 13.2శాతం మంది వినికిడి కోల్పోయామని చెప్పారు. మీజిల్స్, గవదబిళ్లలు, మెనింజైటిస్ వంటి వైరస్‌ల కారణంగా వినికిడి కోల్పోయే ప్రమాదం ఉందని, మెదడు నుంచి నాలను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. కోవిడ్ కారణంగా చెవి లేదా కోక్లియతో సహా వినికిడి వ్యవస్థ భాగాల్లో పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అడిటరీ న్యూరోపతి, కోక్లియా తెలిపిన వివరాల ప్రకారం..నాడి వెంట మెదడుకు ప్రసారం బలహీనంగా మారుతుందని చెబుతున్నారు.