ఫాబి ఫ్లూ.. కోవిఫర్.. సిప్రెమి.. గేమ్ ఛేంజర్లు ఎంతమాత్రం కావా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Jun 2020 6:32 AM GMTకొరకరాని కొయ్యలా మారిన కరోనా మహమ్మారి.. ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమకాలీన కాలంలో యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఉదంతం ఏమైనా ఉందంటే ఇదేనని చెప్పక తప్పదు. అన్ని వ్యవస్థల్ని స్తంభించిపోయేలా చేసిన ఈ మహమ్మారికి నేటికి వ్యాక్సిన్ రాలేదు. ఎప్పటికి వస్తుందో కూడా తెలీని పరిస్థితి. కాకుంటే.. కొద్దిరోజులుగా వస్తున్న కొత్త ఔషధాల మీద సాగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు.
గడిచిన వారంలో కరోనా రోగానికి చెక్ పెట్టే మందులు వచ్చేసినట్లు ప్రచారం సాగుతున్న.. అదేమాత్రం నిజం కాదన్నది మర్చిపోకూడదు. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన ఫాబి ఫ్లూ.. కొవిఫర్.. సిప్రెమి.. లాంటి మందులేవీ కూడా మహమ్మారి సోకుండా కాపాడలేవు. కాకుంటే.. దాని బారిన పడిన వారికి ఉపశమనం కలిగించటం.. త్వరగా కోలుకునేందుకు మాత్రమే సాయం చేస్తాయన్నది మర్చిపోకూడదు. ప్రముఖ కంపెనీలకు చెందిన ఉత్పత్తులు మహమ్మారికి చెక్ పెట్టలేవు. కాకుంటే.. దాని బారిన పడిన తర్వాత బయటపడేసేందుకు సాయం చేస్తాయి మాత్రమే.
ఈ వైరస్ బారిన పడిన వారికి.. వారికుండే తీవ్రత.. రోగ లక్షణాల ఆధారంగా చికిత్స చేస్తున్నారే తప్పించి.. దీని నుంచి కాపాడే సమర్థమైన చికిత్స ఇప్పటివరకూ ఏదీ అందుబాటులోకి రాలేదన్నది మర్చిపోకూడదు. ఇదే విషయాన్ని ఎయిమ్స్ ఢిల్లీ వైద్యులు సంజయ్ రాయ్ స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడున్న ఔషధం ఏదీ కూడా గేమ్ ఛేంజ్ ఎంతమాత్రం కాదన్నది మర్చిపోకూడదు.
ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన ఔషధాలన్నికూడా పేషెంట్ల ఒంట్లో వైరస్ లోడ్ ను తగ్గించేవే తప్పించి.. ఇంకేమీ కాదు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మహమ్మారి బారిన పడిన చాలామంది ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన మందుల అవసరం లేకుండానే కోలుకోవటాన్ని పలువురు వైద్యులు ప్రస్తావిస్తున్నారు. జ్వరం వస్తే పారాసిటమాల్.. గొంతునొప్పి వస్తే అజిత్రోమైసిన్..ఒక కోర్సుగా వాడితే సరిపోతుందని చెప్పే వారున్నారు. ఇలాంటి చికిత్సతోనే ఇప్పటికి కొన్ని వేల మంది కోలుకొన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదని చెబుతున్నారు.
మార్కెట్లోకి వచ్చిన రెమ్డెసివిర్ కానీ ఫాబి ప్లూ.. ఫావిపిరావిర్ లాంటి వాటితో లక్షణాల తీవ్రతను మాత్రమే తగ్గిస్తుందని చెబుతున్నారు. వీటితో పోలిస్తే.. అంతోఇంతో ప్రభావాన్ని చూపించే ఔషధంగా డెక్సామెథసోన్ ను చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గేమ్ ఛేంజర్ అనే మాటను వాడాల్సి వస్తే.. డెక్సామెథసోన్ ను మాత్రమే చెప్పాలంటున్నారు.
తీవ్ర లక్షణాలతో బాధ పడుతున్న వారికి ఈ మందు చాలా బాగా పని చేస్తుందన్న మాటను పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. మరణాల్ని తగ్గించటమే కాదు.. చౌకగా లభించే మందుగా దీన్ని పలువురు అభివర్ణిస్తున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ ఊపిరితిత్తుల సర్జన్ డాక్టర్ అరవింద్ కుమార్ చెబుతున్నారు.