దేశంలో పెరిగిన కరోనా మరణాల లెక్కలు వింటే షాకే

By సుభాష్  Published on  1 Aug 2020 5:56 AM GMT
దేశంలో పెరిగిన కరోనా మరణాల లెక్కలు వింటే షాకే

దేశంలో అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా ఆందోళన కలిగిస్తుంటే.. తాజాగా ముగిసిన జులై పలు రికార్డుల్ని క్రియేట్ చేసింది. భవిష్యత్తు మరెంత భయానకంగా ఉంటుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చేసింది. వ్యాక్సిన్ రావటానికి మరో ఐదారునెలలు కచ్ఛితంగా పట్టే అవకాశం ఉండటంతో.. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

కేసులు పెరగటం ఒక ఆందోళన అయితే.. ఇటీవల కాలంలో కరోనాతో పెరుగుతున్న మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన గణాంకాలు చూస్తే.. మరణాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తుంది. మార్చిలో కరోనా కేసు నమోదైన నాటి నుంచి జూన్ చివరి వరకు దేశ వ్యాప్తంగా 17,400 మంది మరణిస్తే.. ఇందుకు భిన్నంగా ఒక్క జులైలోనే వైరస్ పుణ్యమా అని ప్రాణాలు విడిచిన వారు ఏకంగా 18,347 మంది కావటం గమనార్హం. తాజాగా నమోదైన లెక్కల ప్రకారం.. కరోనా కారణంగా మరణాలు ఎక్కువగా చోటుచేసుకున్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో చేరింది. రానున్న రోజుల్లో మరణాల సంఖ్య మరింత పెరగటం ఖాయమంటున్నారు.

గతంలో యాభై వేల పాజిటివ్ కేసులు నమోదు కావాలంటే వారాలకు వారాలు పట్టేది.ఇప్పుడు అందుకు భిన్నంగా కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. దీంతో.. ఒక రోజులోయాభై వేల కేసులు నమోదు అయ్యే వరకు వెళ్లింది. దేశంలో ఒకే రోజులో 50వేల కేసులు నమోదు కావటం వరుసగా రెండో రోజు కావటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే రీతిలో పెరుగుతూ పోతే పరిస్థితి ఎక్కడి వరకు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్న. కేసులు పెరుగుతున్నకొద్దీ.. దానికి అనుగుణంగా మరణాల సంఖ్య పెరగటం ఖాయం. అంటే.. రానున్న రోజుల్లో మరింత ముప్పు పొంచి ఉన్నట్లే. బీకేర్ ఫుల్.

Next Story