పెరుగుతున్న కరోనా మృతులు..

By రాణి  Published on  11 Feb 2020 8:54 AM GMT
పెరుగుతున్న కరోనా మృతులు..

ముఖ్యాంశాలు

  • తెరుచుకోని పరిశ్రమలు

చైనాలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 1000 దాటింది. మంగళవారం నాటికి చైనాలో కరోనా మృతుల సంఖ్య 1016కు చేరింది. సోమవారం ఒక్కరోజే 108 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలు కలత చెందుతున్నారు. కొత్తగా 2,478 కేసులు నమోదవ్వడంతో కరోనా బాధితుల సంఖ్య 42,638కి చేరింది. కరోనా వ్యాప్తించింది వూహాన్ నుంచే అయినా...ఇప్పుడు దీని ప్రభావం హుబెయ్ ప్రావిన్స్ లో ఎక్కువగా కనిపిస్తోంది. సోమవారం ఈ ప్రాంతంలోనే 103 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

కాగా..చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సోమవారం ముఖానికి మాస్క్ ధరించి బీజింగ్ లో పర్యటించారు. అక్కడున్న కరోనా శిబిరాన్ని ఆయన పరిశీలించారు. హుబెయ్ ప్రావిన్స్ ప్రజలకు యావత్ చైనా అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ క్షేత్రస్థాయిలో పర్యటించడం ఇదే మొదటిసారి.

కరోనా ప్రభావంతో చైనా లోని కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. ఫిబ్రవరి 9వ తేదీ వరకూ న్యూ ఇయర్ సెలవులు కొనసాగాయి. తిరిగి ఉద్యోగస్తులు తమ విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. కానీ..కొన్ని ఫ్యాక్టరీలు ఇంకా మూతను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి. కరోనా ప్రభావమున్న ప్రాంతాల నుంచి ఆయా కంపెనీల్లో పనిచేసే వారు ఇంకా తిరిగి సొంత ఊర్లకు చేరుకోకపోవడంతో ఈ సెలవులు ఈ నెల 17వ తేదీ వరకూ కొనసాగుతాయని తెలుస్తోంది. దీని వల్ల కార్ల తయారీ పరిశ్రమలతో పాటు, టూ వీలర్, మొబైల్ పరిశ్రమలు, టీవీ పరిశ్రమలు చాలా నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగితే వాహన రంగం నుంచి చైనా నుంచి పార్ట్లు దిగుమతి చేసుకుని రూపొందే అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయే ప్రమాదం ఉంది.

మరోవైపు కేరళలో ఒక విద్యార్థిని కొంతకాలంగా కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంది. తాజాగా వైద్యులు ఆమెకు పరీక్షలు చేయగా..విద్యార్థినిలో వైరస్ లేదని తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా..కేరళలోనే కరోనా బారిన పడిన మరో ఇద్దరు ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు.

Next Story