అమెరికాలో తొలి కరోనా మృతి

By సుభాష్  Published on  2 March 2020 12:51 PM GMT
అమెరికాలో తొలి కరోనా మృతి

అమెరికాలో తొలి కరోనా మృతి నమోదైంది. వాషింగ్టన్ రాష్ట్రంలో ఒక మహిళ కరోనా బారిన పడి చనిపోయిందని దేశాధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించాడు. అంతే కాక ఇరాన్ నుంచి అమెరికాలోకి రాకపోకలను నిషేధిస్తూ ఆయన ప్రకటన జారీ చేశారు. ఇరాన్ లో పదిహేను రోజులు నివసించిన వారిని తమ దేశంలోకి రాకుండా అమెరికా నిర్ణయం తీసుకుంది. అదే విధంగా దక్షిణ కొరియాలోని కొన్ని ప్రభావిత ప్రాంతాలకు, ఇటలీకి కూడా వెళ్లొద్దని అమెరికా పౌరులకు ఆయన సూచనలు జారీ చేశారు.

అమెరికాలో ఇప్పటికి పదిహేను కరోనా కేసులు నమోదయ్యాయి. వీరందరూ కరోనా బారిన పడి తరువాత చికిత్స పొంది కోలుకున్నారు. కరోనా ఉందని అనుమానిస్తున్న వ్యక్తులకు పరీక్షలను నిర్వహించి, క్వారంటైన్ చేసి, వారు రోగ ముక్తులైన తరువాత విడుదల చేస్తామని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రజలు అనవసరంగా ఆందోళన పడొద్దని ఆయన సూచించారు. అమెరికా కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని ఆయన అన్నారు. కరోనా ప్రబావిత ప్రాంతాల ప్రజలు రాకుండా చూసే కార్యక్రమ బాధ్యతలను ట్రంప్ ఉపాధ్యక్షుడు పెన్స్ కి అప్పగించారు. కరోనాను తట్టుకునే విషయంలో తాము సర్వ సన్నద్ధంగా ఉన్నామన ఆయన అన్నారు.

మరో వైపు దేశంలోని అన్ని వ్యాధి పరిశోధన శాలలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వివిధ దేశాలనుంచి అమెరికాలోకి వస్తున్న వారిని పరీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాలో తొలి కరోనా మృతి నమోదైంది. పెర్త్ కి చెందిన ఒక 78 ఏళ్ల వ్యక్తి కరోనా బారిన పడి చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాకిస్తాన్ అఫ్గనిస్తాన్ సరిహద్దులను మూసివేసింది.

Next Story