నిమ్స్ లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్  రిజల్ట్ మాటేమిటి?

By సుభాష్  Published on  22 July 2020 5:38 AM GMT
నిమ్స్ లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్  రిజల్ట్ మాటేమిటి?

కరోనాకు చెక్ చెప్పే వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని నిమ్స్ (నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో తొలి అడుగు సక్సెస్ అయ్యింది. కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ ఫలితాలు బాగున్నట్లు చెబుతున్నారు. ఇద్దరు వాలంటీర్లకు కొవాక్జిన్ వ్యాక్సిన్ ను ఇవ్వటం.. వారి ఆరోగ్యం బాగుండటంతో వారిని డిశ్చార్జ్ చేశారు.

వారి ఆరోగ్యం నిలకడగా ఉందని.. పద్నాలుగు రోజుల పాటు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని నిమ్స్ లోని కొవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రిన్సిపల్ ఇస్వెస్టిగేటర్.. కమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ పద్నాలుగు రోజుల పాటు.. రోజూ ఫోన్ లోనూ.. వీడియో కాల్స్ ద్వారా వలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తామని చెప్పారు. తర్వాత మళ్లీ ఆసుపత్రికి వారిని తీసుకొచ్చి రక్త నమూనాల్ని సేకరించి పరీక్షిస్తామన్నారు.

వ్యాక్సిన్ లోని అన్ యాక్టివేటెడ్ వైరస్ తో శరీరంలో యాంటీబాడీస్ ఏ మేరకు డెవలప్ అయ్యాయి? ఇతర సమస్యలు ఏమైనా వచ్చాయా? అనే అంశాల్ని పరిశీలిస్తారు. అంతా బాగుంటే.. రెండో దశ వ్యాక్సిన్ ఇస్తామని చెబుతున్నారు. టీకా తీసుకున్న వారిలో ఎలాంటి అలర్జరీలు రాలేదని.. ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురుకాలేదన్నారు. కోవాక్జిన్ టీకా మానవ ప్రయోగం తొలి ప్రయత్నం విజయవంతమైనట్లుగా నిమ్స్ వైద్యులు చెబుతున్నారు.

నిమ్స్ లో నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా పదమూడు మంది వలంటీర్ల రక్త నమూనాల్ని వైద్యులు సేకరించి.. వాటిని ఢిల్లీలోని ఐసీఎంఆర్ కు పంపారు. అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వారికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికి ఎనిమిది మందికి ఫిట్ నెస్ సర్టిఫికేట్లు జారీ అయ్యాయి. వీటి ఆధారంగా ఈ రోజు (బుధవారం) మరో ఇద్దరికి టీకాలు ఇవ్వనున్నారు. మొదటి రెండు దశల్లో 60 మందికి.. మూడో దశలో వందమందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మొత్తం ఐదుడోసుల మేరకు టీకా ఇస్తారు. ఈ ఫలితాలు రావటానికి రెండు.. మూడు నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ట్రయల్స్ సక్సెస్ అయితే.. ఈ ఏడాది చివరకు కానీ.. వచ్చే ఏడాదికి కానీ వ్యాక్సిన్ వచ్చే వీలున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

Next Story