ఏప్రిల్, మే నెలల్లోనే పెళ్లిళ్లకు ఎందుకంత ప్రాధాన్యం ?
By రాణి Published on 17 April 2020 11:17 AM GMTముఖ్యాంశాలు
- కరోనా కారణంగా ఆగిపోయిన వేల పెళ్లిళ్లు
- ఒక్క హైదరాబాద్ లో 15 వేల పెళ్లిళ్లకు బ్రేకిచ్చిన కరోనా
ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న అలజడికి అంతులేకుండా పోయింది. భారత్ లో కూడా 24 గంటల వ్యవధిలో సుమారు 1000 వరకూ పాజిటివ్ కేసులు నమోదవుతుండగా పదుల సంఖ్యలో మరణాలుంటున్నాయి. ఇక పెళ్ళిళ్లు, పుట్టినరోజు ఫంక్షన్లు, అన్నప్రాసన, నామకరణ మహోత్సవాలు ఇలా ఇతరత్రా కార్యక్రమాలైతే నిర్వహించే ఆస్కారమే లేదు. ముఖ్యంగా కరోనా వైరస్ పెళ్లిళ్లపై పెను ప్రభావాన్నే చూపింది. పెళ్లిళ్ల సమయంలో వందలు, వేల సంఖ్య ప్రజలో ఒకే ప్రాంతంలో గుమిగూడే అవకాశం ఉంది. దీంతో కరోనా సామాజిక వ్యాప్తి అతివేగంగా జరుగుతుందన్నభయంతో ప్రభుత్వాలు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశ వ్యాప్తంగా ఒక్కటవ్వాల్సిన కొన్ని వేల జంటలు పెళ్లిళ్లను వాయిదా వేసిన పరిస్థితి. ఫలానా రోజున పెళ్లిళ్లు చేయాలని ముందుగానే పెట్టిన ముహూర్తాలన్నీ క్యాన్సిల్ అయ్యాయి. ఫంక్షన్ హాళ్లకిచ్చిన అడ్వాన్సులు
వెనక్కిచ్చేశారు. పెళ్లిళ్ల రద్దుతో భాజా భజంత్రీలు, క్యాటరింగ్ సిబ్బంది, ఫంక్షన్ హాళ్లను శుభ్రం చేసే పనివారు, కెమెరా మెన్లు ఇలా కొన్ని వేల మంది ఆదాయానికి గండి పడింది.
ఏప్రిల్, మే నెలల్లోనే పెళ్లిళ్లు ఎందుకు జరుగుతాయంటే..
ఏడాదికి 12 నెలలున్నా 12 నెలల్లోనూ పెళ్లిళ్లు జరగవు. తెలుగు నెలల ప్రకారం ఓ జంట పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలంటే చాలా తతంగం ఉంటుంది. పెళ్లిచూపులు, నిశ్చయ తాంబూలాలు, ఎంగేజ్ మెంట్..పసుపు కొట్టుడు, పెళ్లికూతురు, పెళ్లికొడుకుని చేయడం, ఎదుర్కోళ్లు, ఆఖరి ఘట్టం పెళ్లి. పెళ్లి చూపులు మొదలు కొని పెళ్లికి సంబంధించి చేసే ప్రతి పనీ ముహూర్త బలంతో ముడిపడి ఉంటుందని నమ్మకం. మంచి ముహూర్తంలో చేయాల్సిన పనిని మొదలు పెడితే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. ముఖ్యం వధూవరులు పంతులు పెట్టిన ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెడితే ఆ జంట కలకాలం కలిసి ఉంటుందన్న నమ్మకం మన పెద్దవాళ్లకు. ఏప్రిల్, మే నెలల్లో వేసవి తాపం బాగా ఉంటుంది. కానీ ఇదే సమయంలో వచ్చే పెళ్లి ముహూర్తాలు కూడాఅంతే బలంగా ఉంటాయి. ఈ సమయానికి ఒక్క సెకన్ అటూ ఇటూ కూడా కానివ్వరంటే నమ్మండి.
ఉగాది రాకతో తెలుగు నెలలు మొదలవుతాయి. చైత్రం, వైశాఖం లో ఎక్కువగా పెళ్లి ముహూర్తాలుంటాయి. జ్యేష్ఠంలో ఇంటికి పెద్ద కొడుకు లేదా పెద్ద కూతురైతే ఆ మాసంలో పెళ్లి చేయకూడదు. వెంటనే ఆషాఢం..అటు తర్వాత శ్రావణం. శ్రావణ మాసంలో ముహూర్తాలున్నా పెళ్లి జరిగేది తక్కువ. ముహూర్తాలకన్నా మూఢాలే ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాతొచ్చే బాధ్రపదంలో పెళ్లిళ్లు చేయకూడదు. మళ్లీ ఆశ్వయుజానికి గాని ముహూర్తాలు దొరకవు. అంటే చైత్ర మాసంలో సంబంధం ఖాయమైతే మళ్లీ ఏడు నెలలపాటు వేచి ఉండాలి. అంతవరకూ ఉండలేని చాలా మంది చైత్రం, వైశాఖంలో ఉండే ముహూర్తాల్లో పెళ్లి చేసేందుకే మొగ్గు చూపుతారు. పైగా ఈ రెండు నెలల్లో ముహూర్తాలు చాలా బలంగా ఉంటాయని నమ్మిక కూడా.
ఏప్రిల్ 15నే వేల పెళ్లిళ్లు
ఈ ఏడాది అనగా 2020 సంవత్సరంలో ఏప్రిల్, మే నెలల్లో వేలాది జంటలు ఒక్కటవ్వాల్సి ఉంది. ఒక్క హైదరాబాద్ లోనే 15 వేల పెళ్లిళ్లు జరగాల్సి ఉండగా..ఒక్క వైరస్ కారణంగా అవన్నీ వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 15న ఒక్కరోజే వేల పెళ్లిళ్లు జరగాల్సి ఉందని అంచనా. ఈ ఒక్క ముహూర్తం కోసం కొంతమంది విదేశాల నుంచి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే వరుసగా 16,17 తారీఖుల్లో వృశ్చిక, కుంభ లఘ్నాల్లో పెళ్లిళ్లు జరగాల్సి ఉంది. మే 1, 3,6,7,13,17 తేదీల్లో కూడా పెళ్లిళ్లు జరగాల్సి ఉంది కానీ మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ గడువును పొడిగించారు. ఆ తర్వాత కూడా లాక్ డౌన్ ను సడలిస్తారో లేదో ప్రశ్నార్థకమే. ఏప్రిల్ 14వ తేదీతోనే లాక్ డౌన్ ను సడలించి ఉంటే..ఎంచక్కా పెళ్లిళ్లు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చని చాలా జంటలు ఆశపడ్డాయి కానీ వారి ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. నేనుండగా మీరు పెళ్లిళ్లెలా చేసుకుంటారో చూస్తానంటూ కాచుక్కుచ్చుంది. మే 3వ తేదీన లాక్ డౌన్ ఎత్తి వేసినా ఇప్పుడు వాయిదా పడిన పెళ్లిళ్లన్నీ ఒక్కసారే జరిగే ఆస్కారం లేదు. కొన్ని పెళ్లిళ్లు జరిగినా ఇంకొన్ని జంటలు మాత్రం ఆశ్వయుజం వరకూ వేచి ఉండక తప్పదు. పెళ్లిళ్ల వాయిదాలతో ఫంక్షన్ హాళ్లు కూడా కళ తప్పాయి.