ఒక వ్యక్తి ద్వారా కుటుంబంలోని అందరికి కరోనా సోకదు
By సుభాష్ Published on 3 Aug 2020 10:38 AM ISTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కాలరాస్తోంది. వైరస్ వివిధ రకాలుగా రూపాంతరం చెందుతుందని, గాలిలో కూడా కొన్ని గంటల పాటు ఉంటుందని రకరకాలుగా వార్తలు రావడంతో జనాల్లో మరింత భయం పట్టుకుంది. ఇక గుజరాత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థ కరోనా గురించి ఓ విషయాన్ని వెల్లడించింది. ఓ వ్యక్తి ద్వారా కుటుంబ సభ్యులందరికి కరోనా సోకుతుందని చెప్పలేమని, అలాంటి అవకాశాలు చాలా తక్కువగా అని అధ్యయనంలో తేలింది. కరోనా సోకిన వ్యక్తి ఉన్న కుటుంబంలోని దాదాపు 80 నుంచి 90శాతం సభ్యులకు ఆ వైరస్ సోకకపోవచ్చని ఆ అధ్యయనంలో తెలిసింది. అందుకు కారణం వైరస్ సోకిన వారిలో నిరోధక శక్తి పెరగడమే కావచ్చని వివరించింది.
కరోనా వచ్చిన వ్యక్తి కలిసిన అందరికి వైరస్ సోకుతుందని చెప్పలేము. అదే నిజమైతే కరోనా నిర్ధారణ అయిన కుటుంబంలోని అందరికి వైరస్ సోకి ఉండాలి. కానీ అలా జరిగిన సందర్బాలు చాలా తక్కువ. కరోనాతో మృతి చెందిన వ్యక్తి కుటుంబాల్లో కూడా ఎవరికి కరోనా వైరస్ సోకని ఉదాహరణలు కూడా ఉన్నాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థ డైరెక్టర్ దిలీప్ మవలాంకర్ తెలిపారు.
13 పరిశోధనల ఆధారంగా ఈ అధ్యయనం
ఒక వ్యక్తి ద్వారా కుటుంబ సభ్యులకు వైరస్ సోకే అవకాశాలపై అంతర్జాతీయంగా ప్రచురితమైన 13 పరిశోధనల ఆధారంగా ఈ అధ్యయనం చేసినట్లు ఆయన వెల్లడించారు. అహ్మదాబాద్‌లో కేసుల సంఖ్య భారీగా పెరిగి, ఆ తర్వాత ఒక్కసారిగా తగ్గిపోయాయని, అందుకు హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడమే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.