సోనియా దూత సడెన్‌గా హైద‌రాబాద్‌కు ఎందుకొచ్చారు ?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2019 5:23 AM GMT
సోనియా దూత సడెన్‌గా హైద‌రాబాద్‌కు ఎందుకొచ్చారు ?

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ డీలా ప‌డిపోయింది. దీంతో పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. ఈ మేరకు సోనియాగాంధీ తిరిగి పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టారు. అ తర్వాత హ‌రియాణా, మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ఫలితాలతో పార్టీకి మ‌ళ్లీ కొత్త జీవం తీసుకువ‌చ్చాయి. దీంతో సోనియా దేశవ్యాప్తంగా పార్టీ బ‌లోపేతంపై ఫోక‌స్ పెట్టారు.

అయితే తెలంగాణ‌ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ మూడు ఎంపీ సీట్ల‌ను గెలుచుకోవడంతో పాటు.. చాలా చోట్ల ఓట్ల శాతం పెరిగింది. ఈ మేరకు ఓట్ల శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సోనియా దృష్టిపెట్టిన‌ట్లు స‌మాచారం.

అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల వరకు జరిగిన అన్ని ఎలక్షన్స్‌లోను కాంగ్రెస్‌ పరాజయం పాలయ్యింది. ఈ వ‌రుస ప‌రాజ‌యాల‌తో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌ను మార్చాల‌నే డిమాండ్ గాంధీభ‌వన్‌లో మొద‌లైంది. కాగా..అటు ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఉత్తమ్ కూడా త‌ప్పుకునేందుకు రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ప్ర‌కృతి వైద్యం కోసం కేర‌ళ వెళ్లిన‌ట్లు స‌మాచారం. ఈ మేరకు అధిష్టానానికి తాను దిగిపోతాన‌ని వ‌ర్త‌మానం పంపినట్లు సమాచారం.

దీంతో సోనియా ఉత్త‌మ్ వార‌సుడి ఎంపిక‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే తెలంగాణ కాంగ్రెస్ ప‌రిస్థితులను తెలుసుకున్నారు.

ఈ మేరకు ప‌లువురు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీ వెళ్లి సోనియాను క‌లిసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పీసీసీ చీఫ్ ఎవ‌రికి ఇవ్వాలి? అంద‌రినీ క‌లుపుకుపోయే నేత ఎవ‌రు? ప‌్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పార్టీకి ఎవ‌రి నాయ‌క‌త్వం అవ‌స‌రం అనే డిటైల్స్‌ను సోనియా సేక‌రించార‌ని స‌మాచారం.

అయితే గ్రౌండ్ లెవ‌ల్లో ఏం జ‌రుగుతుందో తెలుసుకునేందుకు సోనియా దూత గులాం న‌బీ ఆజాద్ హైద‌రాబాద్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి..? ప‌్ర‌స్తుతం గ్రూపులుగా విడిపోయిన ఈ నేత‌ల‌ను క‌లిపే వారు ఎవ‌రు? అనే విష‌యాల‌పై ఆజాద్ స‌మాచారం సేక‌రించి సోనియాకు రిపోర్టు ఇస్తార‌ని స‌మాచారం.

2004కు ముందు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్న కాంగ్రెస్ నేత‌ల‌ను క‌లప‌డంలో గులాం న‌బీ ఆజాద్ పాత్ర ఉంది. ఇక్క‌డ నాయ‌కుల పూర్తి బ‌యోడేటా ఆయ‌న‌కు తెలుసు.

అందుకే స‌డెన్‌గా ఆజాద్ హైద‌రాబాద్ వ‌చ్చార‌ని అంటున్నారు. ఆజాద్ రిపోర్టు ఆధారంగానే తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పులు చేర్పులు ఉండే అవ‌కాశం ఉంది.

Next Story