మోదీని కలిసిన కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి ..

By Newsmeter.Network  Published on  17 March 2020 10:10 AM GMT
మోదీని కలిసిన కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి ..

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏది చేసినా సంచలనమే. ఇటీవల కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన కోమటిరెడ్డి.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, బలోపేతం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం మోదీతో భేటీ అయిన ఆయన పలు విషయాలపై నిశితంగా చర్చించినట్లు తెలిసింది. ముఖ్యంగా నాలుగు అంశాలపై ప్రధానికి కోమటిరెడ్డి వినతులు అందించారట.

భేటీ అనంతరం ఆయన మీడియాకు మోదీతో చర్చించిన విషయాలను వివరించారు. ప్రధానంగా హైదరాబాద్‌లో ఫార్మాసిటీ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు నిలిపివేయాలని కోరినట్లు తెలిపారు. ఫార్మాసిటీ వల్ల హైదరాబాద్‌పై కాలుష్య ప్రభావం ఉంటుందని అన్నారు. ఎయిర్‌పోర్టు దగ్గర ఫార్మాసిటీ రానివ్వమని, వేరే దగ్గర పెట్టుకోవాలని సూచిస్తున్నట్లు తెలిపారు. ఫార్మాసిటీకి తాము వ్యతిరేకం కాదని, హైదరాబాద్‌ శివారు నుంచి మరో ప్రాంతానికి తరలించాలని మోదీని కోరినట్లు తెలిపారు. ఆధునిక పరిజ్ఞానం ఎంతలా అభివృద్ధి చెందినా హైదరాబాద్‌లో సగం ప్రాంతం కాలుష్యం భారిన పడుతుందని కోమటిరెడ్డి అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు నుండి కొత్తగూడెం వరకు జాతీయ రహదారిగా చేయాలని మోదీని కోరానని కోమటరెడ్డి తెలిపారు. మూసీనది శుద్దికి రూ. ౩వేల కోట్లు కేటాయించాలని, సీవరేజ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు.

మోదీతో రాజకీయాలు చర్చించారా అని మీడియా ప్రశ్నించగా.. ప్రధానితో రాజకీయాలేం మాట్లాడతామని వ్యాఖ్యానించారు. తెరాస పాలనలో తెలంగాణ ఎలా నాశనమైందనే విషయాన్ని మోదీకి వివరించానని అన్నారు. రూ. 4లక్షల కోట్ల అప్పులు చేశారని, ప్రాజెక్టుల పేరుమీద ఏ విధంగా దోచుకుంటున్నారనే అంశాలను ప్రధానికి తెలిపానని కోమటిరెడ్డి అన్నారు. అయితే ఈ విషయాలన్నీ మోదీ దృష్టిలో ఉన్నాయని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Next Story