అసెంబ్లీలో గందరగోళం.. కాంగ్రెస్ సర్కార్‌కు స్వల్ప ఊరట!
By Newsmeter.Network
మధ్య ప్రదేశ్ అసెంబ్లీ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. నేడు జరగాల్సిన బలపరీక్ష జరగకపోవటం, అసెంబ్లీ వాయిదా పడటంతో కాంగ్రెస్ సర్కార్‌కు స్వల్ప ఊరట లభించినట్లయింది. మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కార్‌కు ఆ పార్టీ సీనియర్‌నేత జ్యోతిరాధిత్య సింధియా షాక్ ఇచ్చాడు. కాంగ్రెస్ సర్కార్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దీంతో సింధియా వెంట 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. కాగా సింధియా బీజేపీలో చేరడంతో, ఆయనకు రాజ్యసభ సీటు దక్కనుంది. ఇదిలా ఉంటే అప్పటి వరకు స్వల్ప మెజార్టీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న కమల్‌నాథ్ ప్రభుత్వంపై సింధియా తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో ఎమ్మెల్యేల బలం తగ్గింది.
దీంతో బీజేపీ నేతలు మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండర్‌ను కలిసి బలపరీక్షకు అవకాశం కల్పించాలని కోరారు. గవర్నర్ సోమవారం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవాలని శనివారం రాత్రి ఆదేశించారు. అయితే స్పీకర్ భిన్నంగా స్పందించారు. బలపరీక్షపై సోమవారమే రూలింగ్ ఇస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు ఉదయం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. కేవలం ఒక నిమిషం మాత్రమే మాట్లాడిన గవర్నర్ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు రాజ్యంగ సంప్రదాయాలను, చట్టాలను పాటించాలని, ప్రజాస్వామ్య, శాసనసభ మర్యాదను కాపాడాలని కోరారు. అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు.
ఇదిలా ఉంటే శాసన సభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగానే.. ఎమ్మెల్యేల రాజీనామాలపై అధికార, ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈనేపథ్యంలో బలపరీక్షపై ఎలాంటినిర్ణయం తీసుకోకుండానే స్పీకర్ సభను వాయిదా వేశారు. సమావేశాలను మార్చి 26వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ సభ నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ ఆదేశాలు పక్కన బెట్టి స్పీకర్ ఈనిర్ణయం తీసుకోవడం పట్ల బీజేపీ ఎమ్మె ల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయంతో కమలనాథ్ ప్రభుత్వానికి కొంత ఊరట లభించినట్లయింది.