కేసీఆర్‌ ప్రాణాలకు ముప్పు.. రేవంత్‌రెడ్డిపై పీఎస్‌లో ఫిర్యాదు..!

By అంజి
Published on : 6 Jan 2020 2:08 PM IST

కేసీఆర్‌ ప్రాణాలకు ముప్పు.. రేవంత్‌రెడ్డిపై పీఎస్‌లో ఫిర్యాదు..!

హైదరాబాద్‌: మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ రేవంత్‌రెడ్డిపై అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు వచ్చింది. సీఎం కేసీఆర్‌కు ఆయన కుమారుడు, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ నుంచే ప్రాణహాణి ఉందంటూ చేసిన ఆరోపణలపై పెద్ద ఎత్తున విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంబర్‌పేటకు చెందిన హైకోర్టు న్యాయవాది గొపగాని రఘురామ్‌ ఆదివారం అంబర్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌ కుటుంబంలో చిచ్చుపెట్టేలా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాని ఎస్సై లక్ష్మయ్యను న్యాయవాది రఘురాం కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదు.

ఈ మధ్య కాలంలో వస్తున్న వార్తలు చూస్తుంటే నిజంగానే సీఎం కేసీఆర్‌ ప్రాణముప్పు ఉందని తెలుస్తోందని ఓ సమావేశంలో రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి అనేది కుటుంబ సభ్యుల మధ్య కూడా చిచ్చుపెడుతుందని, సీఎం కేసీఆర్‌కు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. అర్థరాత్రి తండ్రి మెడ మీద మెత్తపెట్టి ఒత్తిండింటే ఏమైనా జరగోచ్చని రేవంత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా మంత్రి కేటీఆర్‌ సీఎం పదవిపై స్పందించారు. తనకు సీఎం పదవిపై ఎలాంటి ఆశ లేదని తెలిపారు. అయితే పార్టీ వర్గాల్లో మాత్రం మున్సిపల్‌ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేస్తారని గుసగుసలు వినబడుతున్నాయి. మరోవైపు రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అధినాయకత్వంలో ఎలాంటి లోపం లేదంటున్నారు.

Next Story