పులివెందుల ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది - వైఎస్ జగన్
By రాణి
పులివెందుల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడ్రోజుల కడప జిల్లా పర్యటన నేటితో ముగిసింది. ఆఖరిరోజు సొంత నియోజకవర్గమైన పులివెందులలో జగన్ పర్యటించారు. ఉదయం పులివెందులలోని సీఎస్ ఐ చర్చిలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పర్యటనలో భాగంగా పులివెందుల నియోజకవర్గంలో 26 పథకాలకు సంబంధించిన రూ.1327 కోట్ల పనులకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగించారు. ఈరోజు శంకుస్థాపన చేసిన వాటన్నింటి నిధులన్నీ తొలవిడతలో మంజూరు చేసినవేనని, రాబోయే రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం చేయాల్సింది చాలానే ఉందన్నారు. దివంగత సీఎం, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక పులివెందుల ప్రజలే తనకు ధైర్యం చెప్పి అండగా నిలబడ్డారని జగన్ కొనియాడారు. అలా పులివెందుల ప్రజలిచ్చిన ధైర్యంతోనే నేడు సీఎంగా రాష్ర్టానికి సేవ చేసే భాగ్యం దక్కిందని, సీఎంగా పులివెందుల ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని జగన్ వ్యాఖ్యానించారు. మరోసారి జిల్లా పర్యటనకు వచ్చినపుడు గండికోట దిగువన 20 టీఎంసీల సామర్థ్యంతో ఇంకొక సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని జగన్ ప్రకటించారు. నియోజకవర్గంలో నిరుపయోగంగా మారిన అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రంలో వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు జగన్ చెప్పారు.