ఇంత దారుణమా.. అమానవీయ ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌ సీరియస్

By సుభాష్  Published on  27 Jun 2020 12:03 PM IST
ఇంత దారుణమా.. అమానవీయ ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌ సీరియస్

కరోనా మహమ్మారి చేస్తున్న దారుణం అంతా.. ఇంతా కాదు. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి వచ్చింది. ఇక కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వ్యక్తికి కరోనా సోకిందంటే చాలు వైద్య సిబ్బంది తప్ప చూసేందుకు ఎవ్వరు ముందుకు రావడం లేదు. ఇక మృతి చెందిన వారి పరిస్థితి మాత్రం దారుణంగా మారింది. కనీసం కడసారి చూపు నోచుకోలేని పరిస్థితి. చనిపోయిన వారిని కుటుంబ సభ్యులను, బంధువులను సైతం దగ్గరకు కూడా రానివ్వకుండా అంత్యక్రియలు నిర్వహించే అవకాశం లేకుండా పోతోంది.

అయితే ఏపీలో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనాతో చనిపోయిన వ్యక్తిని జేసీబీలో తరలించడం తీవ్ర సంచలనంగా మారింది. ఇలా జేసీబీలో తరలింపుపై ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ వ్యక్తికి కరోనాతో మృతి చెందాడు. ఇలా కరోనాతో మృతి చెందిన వ్యక్తిపై కనీసం కనికరం చూపకుండా దగ్గరకు వచ్చే వారే కరువయ్యారు. కనీసం కుటుంబ సభ్యులు, బంధువులు ఎవ్వరిని కూడా అనుమతించడం లేదు. ఇక అధికారులు సైతం అమానుషంగా ప్రవర్తించి ఆ వ్యక్తిని జేసీబీలో తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం విమర్శలు గుప్పించారు.

అయితే దారుణ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు స్పందించారు. కరోనాతో మృతి చెందిన వ్యక్తిని ఇలా జేసీబీలో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించడంపై విచారణ చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన శ్రీకాకుళం కలెక్టర్‌ ఇద్దరు అధికారులపై వేటు వేశారు. కాగా, ఇది అత్యంత అమానవీయ ఘటన అంటూ సీఎం జగన్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

' శ్రీకాకుళం జిల్లా, పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృత్తం కాకూడదు. బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోకతప్పదు.' అంటూ ట్విట్‌ చేశారు.



Next Story