'నిఘా' యాప్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2020 9:08 AM GMT
నిఘా యాప్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ వంటి అక్రమాలను అరికట్టడానికి ఏపీ ప్రభుత్వం నిఘా యాప్‌ ను తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శనివారం తాడేపల్లిలోని తన నివాసంలో ఈ యాప్‌ను ఆవిష్కరించారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలనుకునే వారిని ప్రోత్సహించడంతో పాటు, ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం, పోలీస్‌ వ్యవస్థ తీసుకుంటున్న చర్యలకు అదనంగా నిఘా యాప్‌ను రూపొందించారు.

మద్యం, డబ్బు పంపిణీతో పాటు ఎలాంటి అక్రమాలపైనైనా నిఘా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. నిఘా మొబైల్ యాప్‌ సామాన్యుడి చేతిలో అవినీతిపై అస్త్రంగా మారనుందన్నారు. ఎవరైనా ఈ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించామని, ఎక్కడ అక్రమాలు కనిపించినా వెంటనే ఈ నిఘా మొబైల్ యాప్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చునని తెలిపారు. యాప్‌ ద్వారా చేసే ఫిర్యాదులు నేరుగా సెంట్రల్‌ కంట్రోల్‌ రూంకు చేరుతాయి. అక్కడ నుంచి సంబంధిత అధికారులు దానిపై చర్యలు తీసుకుంటారని చెప్పారు.

ఈ నెల 21న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఈ నెల 23న మున్సిపల్‌ ఎన్నికలు, ఈ నెల 27న పంచాయతీ మొదటి విడత, 29న పంచాయతీ రెండో విడత ఎన్నికల పోలింగ్‌ ను నిర్వహించనున్నారు.

Next Story