సీఎం కేసీఆర్‌ తీరు అనుమానాలకు తావిస్తుంది - బండి సంజయ్‌

By Newsmeter.Network  Published on  13 May 2020 9:21 AM GMT
సీఎం కేసీఆర్‌ తీరు అనుమానాలకు తావిస్తుంది - బండి సంజయ్‌

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం బీజేపీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్య‌క్షుడు సంజయ్‌ దీక్షలో పాల్గొనగా.. బీజేపీ ముఖ్యనేతలు తమతమ ఇండ్లలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరును చూస్తుంటే అనుమానాలకు తావునిస్తుందని అన్నారు. నిన్న ఏపీకి చెందిన ఓ మంత్రి కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ అన్నదమ్ములని చెప్పారని, ఈ ఇద్దరు కలిసి రెండు తెలుగు రాష్ట్రాలను ఏ విధంగా దోచుకుంటున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కుదుర్చుకొని తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, పాలమూరు, ఖమ్మం ప్రజల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోతిరెడ్డిపాడుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ‌ని తెలిపారు.

కేసీఆర్‌కు తెలియకుండానే జగన్‌ జీవో విడుదల చేశాడా? - డి.కె. అరుణ

సీఎం కేసీఆర్‌తో ఉన్న రహస్య ఒప్పందం మేరకు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి జీవో 203 తీసుకొచ్చాడని బీజేపీ నేత, మాజీ మంత్రి డి.కె. అరుణ ఆరోపించారు. బుధవారం ఆమె నివాసంలో ఏపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ, జీవో 203ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ దీక్షలో పాల్గొన్నారు. పోతిరెడ్డిపాడు వలన ఎక్కువ నష్టపోయేది ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లానేనని అన్నారు. పోతిరెడ్డిపాడును అడ్డుపెట్టుకొని కేసీఆర్‌ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణ ప్రజలపై కేసీఆర్‌ కపట ప్రేమను చూపిస్తున్నాడని, దక్షిణ తెలంగాణ రైతుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందని డి.కె. అరుణ స్పష్టం చేశారు.

Next Story