మోదీ బొమ్మలు తగలబెట్టడంపై వ్యాఖ్యలు చేసిన కేసీఆర్

By సుభాష్  Published on  31 Oct 2020 2:23 PM GMT
మోదీ బొమ్మలు తగలబెట్టడంపై వ్యాఖ్యలు చేసిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే..! తాజాగా కూడా ఆయన ఈ విధానాలను తప్పుబట్టారు. కార్పొరేట్ కంపెనీల మేలు కోసమే ఈ చట్టాలను తీసుకొచ్చారని అన్నారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పాస్ చేసిందని అన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూనే దసరా పండుగ నాడు రావణాసురుడికి బదులుగా మోదీ బొమ్మలను రైతులు తగలబెట్టారని అన్నారు. తెలంగాణ రైతులు కూడా పిడికిలి బిగించాలని పిలుపునిచ్చారు. పెన్షన్ల విషయంలో బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తెలంగాణాలో 38.64 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంటే... కేంద్ర ప్రభుత్వం కేవలం 7 లక్షల మందికి మాత్రమే రూ. 200 చొప్పున ఇస్తోందని అన్నారు. ఈ విషయంలో తాను చెప్పేది తప్పైతే రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని అన్నారు.

రైతు వేదికను ఏర్పాటు చేయడం వ్యవసాయ రంగంలో ఇది ఓ చరిత్ర అని, ప్రపంచంలో ఎక్కడ కూడా వేదికలకు లేవని, అందువల్ల రైతు వేదికల ఏర్పాటు చరిత్ర అని కేసీఆర్ అన్నారు. ఒక చోట కూర్చుని రైతులు మాట్లాడుకునే వ్యవస్థ లేదని లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై రైతులు పిడికిలి ఎత్తి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు మించి చెల్లించి ధాన్యం కొనుగోలు చేయవద్దని ఎఫ్సీఐ ఆదేశాలు జారీ చేసిందని, దీనిపై రైతులు పోరాడాలని ఆయన అన్నారు. అధిక ధరలు చెల్లిస్తే ధాన్యమే కొనుగోలు చేయబోమని రాష్ట్రాలకు ఏఫ్సీఐ ఆదేశాలు జారీ చేసిందని ఆయన అన్నారు. తాను బతికి ఉన్నంత వరకు రైతు బంధు ఆగదని ఆయన స్పష్టం చేశారు.

Next Story