ఆర్టీసీ సమ్మెపై సీఎం సీరియస్‌..చర్చలు ప్రసక్తేలేదన్న కేసీఆర్

By Newsmeter.Network
Published on : 6 Oct 2019 9:21 PM IST

ఆర్టీసీ సమ్మెపై సీఎం సీరియస్‌..చర్చలు ప్రసక్తేలేదన్న కేసీఆర్

  • ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయం
  • సమ్మెకు దిగిన వారితో ఎటువంటి చర్చలు ఉండవు
  • గడువులోపల విధుల్లో చేరకపోతే ఉద్యోగంలోకి తీసుకోరు
  • ఇక ఆర్టీసీలో ప్రైవేటు బస్సులు కూడా ఉంటాయి
  • 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వ స్థితికి రావాలన్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు పోవాలని, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవని సీఎం అన్నారు. సంవత్సరానికి రు.1200 కోట్ల నష్టంతో, రు. 5000 కోట్ల రుణ భారంతో ఉందన్నారు . పెరుగుతున్న డీజిల్ ధరలతో, ఇబ్బందుల్లో ఆర్టీసీ వున్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్లో దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదన్నారు. సమ్మెకు దిగిన వారు చేసింది తీవ్రమైన తప్పిదమని ముఖ్యమంత్రి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఇక వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదని ముఖ్యమంత్రి కుండ బద్దలు కొట్టారు. భవిష్యత్ లో ఆర్టీసీకి సంబంధించి, ఎప్పటికీ క్రమ శిక్షణా రాహిత్యం, బ్లాక్ మెయిల్ విధానం, తలనొప్పి కలిగించే చర్యలు శాశ్వతంగా వుండకూడదని భావిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లోకి హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదన్నారు సీఎం కేసీఆర్‌ .ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది లోపే సిబ్బంది అన్నారు. తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడపాలని ఆదేశించారు. 4114 ప్రయివేట్ బస్సులు ఇంకా వున్నాయి. వాటికి స్టేజ్ కారేజ్ గా చేస్తే వాళ్ళు కూడా ఆర్టీసీలోకి వస్తారని చెప్పారు. ఈ విషయంలో వాళ్ళతో ఆర్టీసీ, రవాణా అధికారులు చర్చలు జరుపుతున్నారని తెలిపారు.

అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నియామక ప్రక్రియ అతిత్వరగా చేపట్టాలన్నారు. కొత్తగా చేర్చుకునే సిబ్బం .ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో ..సగం ప్రైవేట్ బస్సులు, మిగతావి ఆర్టీసీవి అన్నారు. మొత్తం 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలని ముఖ్యమంత్రి అన్నారు.

ఆర్టీసీపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గోన్నారు. అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఆర్టీసీ జేఏసీ భేటీ అయింది. రేపు ఇందిరా పార్క్‌ దగ్గర జరిగే ఆర్టీసీ జేఏసీ దీక్షకు కాంగ్రెస్‌ మద్దతు కోరారు. ఆర్టీసీ జేఏసీ దీక్షకు భట్టి విక్రమార్క మద్దతు ఇచ్చారు.

Also read: https://telugu.newsmeter.in/high-court-rtc-bandh/

Next Story